● 108 వాహనాలకు దారివ్వని జనం ● బాధితులున్నారనే స్పృహ కరువు
రుద్రవరం: కుయ్.. కుయ్ మంటూ సైరన్ వినిపిస్తున్నా అంబులెన్స్ వాహనాలకు దారివ్వాలనే స్పృహ జనంలో కరువుతోంది. బాధితులకు ఆపద సమయంలో అత్యవసర వైద్యం అందించేందుకు పరుగులు తీసే 108 వాహనానికి ప్రధాన రహదారిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సకాలంలోని ఆసుపత్రికి చేరుకోలేక ఎంతో మంది ప్రాణాలు దారిలోనే పోతున్నా ప్రజల్లో చైతన్యం కలగడం లేదు. శుక్రవారం మండల పరిధిలోని అప్పనపల్లె గ్రామ సమీపంలో రెండు మోటర్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ ప్రమాదంలో ఉగ్రనరసింహం, బాలహుస్సేన్, విజయ్‌కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారికి తక్షణ వైద్యం అందించేందుకు 108 వాహనంలో రుద్రవరం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుస్తుండగా గ్రామంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా అడ్డదిడ్డంగా మోటార్ సైకిళ్లు, మరో వైపు గోవులు, ఎదురుగా వస్తున్న ఇతర వాహనాలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎంతకు దారి దొరక్క పోవడంతో 108 వాహనదారులు వెనుదిరిగి గ్రామ శివారు వైపు వెనక్కు వెళ్లి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అంతవరకు ఆ వాహనంలో క్షత గాత్రులకు వైద్యసేవలు అందించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.


