ఆత్మకూరు రూరల్: అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటున్న అటవీశాఖ అధికారులు నల్లమల దారిని కప్పేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆత్మకూరు వైపు నుంచి శ్రీశైలం వెళ్లే వారికి ఎస్‌ఎన్ తండా సమీపంలోనే నల్లమల పచ్చని అడవులు స్వాగతం పలుకుతాయి. అయి తే కొద్ది దూరం వెళ్లిన తర్వాత రహదారికి ఇరువైపుల కుప్పలు తెప్పలుగా రంగురంగుల ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపిస్తాయి. అడవి మీదుగా వెళుతున్న వాహనదారులు పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు పర్యావరణ పరిరక్షణ పన్ను పేరుతో వాహనదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ చెక్ పోస్టుల వల్ల రూ. లక్షలు వస్తున్నప్పటికీ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం లేదనేందుకు బైర్లూటీ వద్ద చెత్త దిబ్బలే నిదర్శనం. ఎన్‌ఎస్‌టీఆర్‌లోని ప్రధాన డివిజన్ అయిన ఆత్మకూరు అటవీ డివిజన్‌లో సగం రేంజ్‌లకు కేంద్ర స్థానమైన బైర్లూటీలో ఇలా ఉంటే నల్లమల దారిలో వ్యర్థాలు ఎంత మేర ఉంటాయో అర్థమవుతోంది.


