25 మంది ఎరువుల డీలర్ల లైసెన్సులు రద్దు | - | Sakshi
Sakshi News home page

25 మంది ఎరువుల డీలర్ల లైసెన్సులు రద్దు

Oct 3 2026 1:08 AM | Updated on Oct 3 2026 1:08 AM

25 మంది ఎరువుల డీలర్ల లైసెన్సులు రద్దు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 25 మంది ఎరువుల డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేసినట్లు జిల్లా వ్యవపాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. అలాగే రూ.1.47 కోట్ల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకున్నామని, రూ.1.05 కోట్ల విలువైన ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశామని చెప్పారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రబీ సీజన్‌లో రసాయన ఎరువులను పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కౌతాళం మండలంలో రాజబక్ష సీడ్‌, ఫర్టిలైజర్స్‌లో రూ.1.20 లక్షల విలువైన ఎరువులను సీజ్‌ చేసి లైసెన్స్‌ను నెల రోజల పాటు సస్పెండ్‌ చేశామన్నారు. ఇదే మండలంలోని శాంభవి పర్టిలైజర్స్‌లో రూ.11.20 లక్షల విలువలైన ఎరువులను సీజ్‌ చేసి నెల రోజులు లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. రసాయన ఎరువులకు ఎలాంటి కొరత లేదన్నారు. డీలర్లు ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించినా.. ఇతర ప్రాంతాలకు మళ్లించినా.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలు జరిగితే 1800 425 4299, 8977702047, 8341302863 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

మంత్రాలయంలో

భక్తుల రద్దీ

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు పోటెత్తారు. శుక్ర, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తుల వేలాదిగా తరలిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. భక్తుల రాకతో శ్రీమఠం మధ్వ కారిడార్‌ సందడిగా కనిపించింది. రాఘవేంద్రుడి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు, మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులు మంచాలమ్మ, రాఘవేంద్రుల బృందావనం దర్శనం చేసుకుని ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల వెండి, స్వర్ణ రథోత్సవాల్లో పాల్గొన్నారు.

హంద్రీలో ఆగని

ఇసుక దందా!

గోనెగండ్ల: హంద్రీ నది నుంచి ఇసుక అక్రమ రవాణా రాత్రీ పగలు అని తేడా లేకుండా నిర్విరామంగా కొనసాగుతోంది. ఒక ట్రాక్టర్‌ ఇసుకను రూ.4వేల నుంచి రూ.5వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక పథకం ఎక్కడా కనిపించడం లేదు. గోనెగండ్ల మండలంలో 28 గ్రామాలు ఉన్నాయి. గంజిహళ్లి, హెచ్‌. కై రవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనదిలో మాత్రమే ఇసుక దొరుకుతోంది. ఆయా గ్రామాలకు తాగునీటి కోసమని హంద్రీనది సమీపంలో వేసిన బోర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్య ఎదురువుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపాశం గ్రామ సమీపంలోని హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెండు రోజుల క్రితం మైనింగ్‌ అధికారులు పట్టుకున్నారు. పగటి పూట బహిరంగంగా ఇసుక తరలిస్తున్నా, అధిక ధరలకు అమ్ముతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

అహోబిలం ఫొటో గ్రాఫర్‌కు జాతీయ స్థాయి పురస్కారం

ఆళ్లగడ్డ: ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా (పీఏఐ), ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రసాద్‌ తీసిన ఫొటోకు ‘ఎక్సలెన్స్‌ అవార్డ్‌ 2026’ లభించింది. శుక్రవారం గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అహోబిలం ఫొటో గ్రాఫర్‌ పురస్కారం అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement