అప్పట్లో కోర్టును ఆశ్రయించలేదా?
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య
కర్నూలు (టౌన్): పార్లమెంటులో చట్టబద్ధత లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చేయలేమన్న సంగతి సీఎం చంద్రబాబుకు బాగా తెలుసని, అయినా మోసం చేస్తున్నారని కర్నూలు నగర మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య అన్నారు. జీవోలను హైకోర్టు డిస్మస్ చేయడం చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదన్నారు. కర్నూలులోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారన్నారు. గత 40 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారన్నారు. బీసీల కోసం రక్షణ చట్టం, ప్రత్యేక ప్రణాళిక, 50 సంవత్సరాలు దాటిన బీసీ మహిళలకు రూ. 4 వేలు పెన్షన్, 100 మంది బీసీ ఎమ్మెల్యేలకు చట్టసభలో అవకాశం కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా పట్టించుకోలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ ఏక సభ్య కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కమిటీ అంటూ రెండు సంవత్సరాలు జాప్యం చేశారన్నారు. ఈ డెడికేషన్ కమిటీలు కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టుకోలేదని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చట్టబద్ధత చేయవచ్చు కదా అని ప్రశ్నించారు.
బీసీలకు న్యాయం చేసేందుకు 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవో 176 తీసుకువచ్చారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా హైకోర్టును ఆశ్రయించారన్నారు. అక్కడ కోర్టు కొట్టివేస్తే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. దీని వెనుక చంద్రబాబు ఉన్నారనే విషయం అందరికీ తెలుసున్నారు. ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అని బీవై రామయ్య ప్రశ్నించారు. దమ్ముంటే కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా దెబ్బకొట్టాలన్నారు.


