కర్నూలు(సెంట్రల్): అహింసనే ఆయుధంగా మలుచుకొని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిన మహాత్మా గాంధీజీ ప్రపంచం మెచ్చిన నాయకుడని, ఆయన అడుగు జాడల్లో నిలవడం ఎంతో గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఎదుట ఉన్న విగ్రహానికి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గాంధీజీ అహింస మార్గాన్ని అనుసరించకపోతే ఎంతో మంది పౌరుల ప్రాణాలు పోయేవన్నారు. అహింసతో సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఎవరైనా హింసా మార్గాన్ని ఎంచుకుంటే దానితో సాధించేదేమీ లేదన్నారు. మహాత్మాగాంధీని స్మరించుకోవడం దేశ ప్రజల బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, తహసీల్దార్ రవికుమార్, రాంభూపాల్ చౌదరి ఎడ్యకేషనల్ సొసైటీ అధ్యక్షుడు వై.రామేశ్వరరెడ్డి, మాంటిస్సోరి పాఠశాలల అధినేత రాజశేఖర్ పాల్గొన్నారు.


