నిరుపేద కుటుంబంనుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన అతను పేద విద్యార్థులకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆత్మకూరు మండలం బాపునంతపు రం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 16 ఏళ్ల క్రితం 2010 నవంబర్‌లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ప్రస్తుతం కొట్టాలచెరువు చెంచుగూడెంలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వ హిస్తున్నారు. చెంచుగిరిజన పిల్లలు చదువుకు దూరంగా ఉండడంతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో సొంత ఖర్చులతో రంగులు వేయించారు. పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు కార్డులు అందజేశారు. వెదురుబొంగులతో అదనపు తరగతి గదిని ఏర్పాటు చేయించారు. ఆర్డీటీ సహకారంతో విద్యా వలంటరీ నియమించారు. దాతల సహకారంతో మినరల్ వాటర్ ఏర్పాటు చేయించారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ.. చెంచు గిరిజన గూడెం విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యమన్నారు. – ఆత్మకూరు


