● కర్నూలులో ఆశావహ పోలీసు అభ్యర్థుల మూడు రోజుల రిలే నిరాహారదీక్షలు ప్రారంభం
కర్నూలు(సెంట్రల్): తమ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ పదవులు పొంది తమనే మరచిపోయారని ఆశావహ పోలీసు అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందారు. శుక్రవారం కర్నూలులో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లాలకు చెందిన ఆశావహ పోలీసు అభ్యర్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే ప్రభుత్వం పోలీసులను అట్టుపెట్టి ఈ దీక్షలను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నిరుద్యోగులు గ్రూపులుగా విడిపోయి నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్లో ఉన్న ధర్నా చౌక్‌కు చేరుకొని దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము, చైతన్య, అంజి, చంద్ర మాట్లాడుతూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిందన్నారు. తరువాత నాలుగేళ్ల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచినా ఉద్యోగాల భర్తీకి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ ప్రతి ఏడాది జాబ్‌క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్‌లో ఒక్క పోస్టునైనా భర్తీ చేయలేకపోయారన్నారు. జాబ్ లేస్ క్యాలెండర్‌ను రూపొందించిన ప్రభుత్వం పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను కేవలం 1,600 చూపడం అన్యాయమన్నారు. అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిత, డీజీపీ చెప్పిన విధంగా 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. పోలీసు అభ్యర్థులు వయో పరిమితి 35 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.


