వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా సామూహిక వరలక్ష్మి వ్రతం

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

వ్రతంలో పాల్గొన్న 1,233 మంది చెంచు, 500 మంది ఇతర భక్తులు

శ్రీశైలంటెంపుల్‌: ధార్మిక కార్యక్రమ నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం శ్రావణ నాల్గవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శుక్రవారం ఆలయ ఉత్తరద్వారం ఎదురుగా చంద్రవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలోని పలు చెంచుగూడేలకు చెందిన 1,233 మంది చెంచు మహిళా భక్తులు, 500 మంది ఇతర మహిళా భక్తులు పాల్గొని వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతాలకు కావలసిన పూజాద్య్రాలన్నింటిని దేవస్థానమే సమకూర్చింది. వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం వేర్వేరుగా కలశాలను నెలకొల్పి శాస్త్రోక్తంగా వ్రతం జరిపించారు. వ్రతాన్ని జరిపించుకున్న వారందరికీ పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, మూడు రకాల ప్రసాదాలు, అమ్మవారి శేవస్త్రాలను కూడా అందజేశారు. సంప్రదాయబద్ధంగా జరిపిన వ్రతంలో మహాగణపతిపూజ, వేదికపై ఆశీనులను చేసిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపించారు. వరలక్ష్మీవ్రతంలో భాగంగా భక్తులందరి చేత విడివిడిగా కలశస్థాపన చేయించి వరలక్ష్మీదేవిని సమంత్రకంగా అవాహన చేశారు. అనంతరం అర్చకులు వ్రతకథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలియజేశారు. చివరిగా నీరాజన మంత్రపుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. భక్తులందరికీ ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement