ఆదిమూర్తి పాఠాలు.. 2.5 లక్షల వీక్షకులు | - | Sakshi
Sakshi News home page

ఆదిమూర్తి పాఠాలు.. 2.5 లక్షల వీక్షకులు

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

రగతి బోధనతో పాటు ఉపాధ్యాయ శిక్షణ, సైన్స్‌ ప్రాజెక్టులు, క్విజ్‌లు, డిజిటల్‌ బోధన, విద్యార్థుల మార్గదర్శకత్వం వంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఆదోని మండలం విరుపాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మైత్రి ఆదిమూర్తికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఆదోనికి చెందిన ఈయన 2003లో స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2023లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తరగతి బోధనకే పరిమితం కాకుండా గత 12 సంవత్సరాలుగా సర్వశిక్ష అభియాన్‌, ఆర్‌.ఎం.ఎస్‌.ఏ. శిక్షణలు, కాంప్లెక్స్‌ సమావేశాలు, పదో తరగతి ఓరియంటేషన్‌ తరగతులు, ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర కార్యక్రమాల్లో రిసోర్స్‌ పర్సన్‌గా సేవలందించారు. అలాగే ఇన్‌స్పైర్‌, ఎన్‌సీఎస్‌సీ, కౌశల్‌ క్విజ్‌ వంటి కార్యక్రమాల కోసం అనేక మంది సైన్స్‌ ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఆదిమూర్తి మార్గదర్శకత్వంలో 2023లో ఒక విద్యార్థి జిల్లా స్థాయి ఎన్‌సీఎస్‌సీకి ఎంపికై రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. అలాగే పదో తరగతి భౌతిక శాస్త్రానికి సంబంధించిన ‘మార్గదర్శి’ స్టడీ మెటీరియల్‌ రచయితగా కూడా ఆయన సేవలందించారు. గత నాలుగేళ్లుగా కర్నూలు జిల్లాలో నిర్వహిస్తున్న కౌషల్‌ జిల్లా స్థాయి క్విజ్‌ కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తూ క్విజ్‌ మాస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఫిజికల్‌ సైన్స్‌కు సంబంధించిన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధనా వనరులను అందిస్తున్నారు. ఆయన రూపొందించిన వీడియోలను 2.5 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వీక్షించి ప్రయోజనం పొందారు. అంతే కాకుండా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఉపయోగపడే పలు మూల్యాంకన పత్రాలను రూపొందించారు. – ఆదోని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement