ఆధునికత, సాంకేతికత పరుగులు పెడుతున్న నేటి కాలంలోనూ మతృభాషను ప్రేమిస్తూ, సాహిత్యాన్ని శ్వాసిస్తూ, తమదైన రచనలతో తెలుగు తల్లికి సేవ చేస్తున్నారు కొందరు. వృత్తుల్లో బిజీగా ఉంటూనే తీరిక సమయాల్లో కవితలు, కథలు, వ్యాసాలు, పాటలు, సాహిత్య రచనలు చేస్తూ మాతృభాష పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను సైతం వేదికగా చేసుకుని దేశభాషలందు తెలుగు లెస్స అని మాతృభాష గొప్పతనాన్ని చాటుతున్నారు.
కర్నూలు కల్చరల్: తెలుగు.. అమ్మ భాష. సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష. మన భాషా మాధుర్యం, గొప్పదనం గురించి నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తారు. తెలుగు భాషను ప్రజల భాషగా, సరళమైన వ్యవహారిక భాషగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. మాతృభాష అనేది కేవలం భావాలను వ్యక్తం చేసే సాధనం మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, జీవన విధానానికి అద్దం. అందుకే తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా యువత తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటంతో పాటు సాహిత్య సృజనలోనూ ముందుకు రావడం భాష భవిష్యత్తుకు భరోసానిస్తోంది.
సమకాలీన అంశాలపై
‘సీమ గొంతుక’గా..
ఈచిత్రంలో ఉన్నది వెంకట నరేంద్ర ప్రసాద్. బదినేహళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ ప్రాంత కరువు, వలసలను వస్తువుగా తీసుకొని ‘సీమ గొంతుక’ పేరుతో కవితా సంపుటిని తీసుకొచ్చారు. ప్రజా సమస్యలు, వర్గవైషమ్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం అనుసరించే తీరు లాంటి సమకాలీన అంశాలపై రాసిన కవితలు పదుల సంఖ్యలో వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘సింహప్రసాద్ కథలు – పరిశీలన’ అనే అంశంపై పరిశోధనా గ్రంథాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ‘జానపద విజ్ఞానం – భావితరాలకు ప్రయోజనం’ అనే వ్యాస సంకలనానికి సంపాదకత్వం వహించారు. ‘అయితే నేడు తెలుగు భాష పరిస్థితి చూస్తే ఆందోళన కలిగించేలా ఉంది. పరభాష మోజులో మన తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని పిల్లలకు దూరం చేయరాదంటున్నా’రు వెంకట నరేంద్ర ప్రసాద్.
మాతృభాషపై మమకారం
తెలుగు సాహిత్యంలో రాణిస్తున్న
ఉపాధ్యాయులు
మాతృ భాషపై మక్కువతో
అనేక రచనలు
నేడు తెలుగు భాష దినోత్సవం
వెయ్యికిపైగా కవితలు రాసి.. కందనవోలు కవయిత్రిగా నిలిచి
ఈ చిత్రంలో ఉన్నది సువర్ణ జోషి. పెద్దకడుబూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘంలో కందనవోలు కవయిత్రిగా పేరు పొందారు. వివిధ అంశాలపై వెయ్యికి పైగా కవితలు వివిధ శీర్షికలతో రాశారు. స్వర్ణ శతకం పేరుతో విలువల గురించి రాశారు. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం నుంచి సుందరకాండ అంశాన్ని తీసుకొని సుందరకాండము పుస్తకాన్ని ముద్రించారు. వివిధ సాహితీ సంస్థల్లో కీలకంగా ఉంటూ సాహిత్య సేవలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తెలుగు భాష సుందరమైన ఆకృతితో సుధాధారమై పరిఢవిల్లుతోంది. కమనీయమైన మాధుర్యంతో అలరారుతున్న తెలుగు భాష వైభవం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సువర్ణ జోషి.


