● సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై
చర్యలు తీసుకోవాలి
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి
కర్నూలు(అర్బన్): నగర శివారుల్లోని పెద్దపాడు బాల సదనం నిర్వహణలో చోటు చేసుకున్న లోపాలు, నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి కోరారు. శుక్రవారం ఉదయం 8.15 గంటలకు ఆయన బాల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో సిబ్బంది ఎవరు లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. వంట మనుషులు శివమ్మ, మునెమ్మ, హెల్పర్ సుమలత మాత్రమే విధుల్లో ఉన్నట్లు ఆయన గుర్తించారు. మెనూ ప్రకారం బాల సదనంలోని పిల్లలకు గుడ్డు అందించారా? అని ఆయన ప్రశ్నించంగా, ఉదయమే గుడ్డు అందించామని వంట మనిషి శివమ్మ చెప్పగా, మరో వంట మనిషి మునెమ్మ ఇంకా గుడ్డు అందించలేదని, గుడ్లు ఉడకాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. అనంతరం ఆయన పిల్లలను విచారించగా, తమకు గుడ్లు అందించలేదని తెలిపారు. మెనూ ప్రకారం గుడ్లు అందించడంలో పొంతన లేని సమాధానాలు చెబుతూ, వాస్తవ విషయాలు ఎవరికి చెప్పకుండా పిల్లలను ఒత్తిడి చేస్తున్నట్లు తమ విచారణలో వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అలాగే విధులకు ఆలస్యంగా హాజరైన విషయాన్ని కూడా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పడం చూస్తుంటే బాల సదనంలో నెలకొన్న పరిస్థితులు, సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. బాల సదనం ప్రాంగణంలో పిల్లల భద్రత, పర్యవేక్షణకు సరైన నిఘా వ్యవస్థ లేదని ఆయన గుర్తించారు. ఈ సదనంలో గణనీయమైన సంఖ్యలో పిల్లలు వసతి పొందుతున్న నేపథ్యంలో పటిష్ట పర్యవేక్షణ అవసరమన చెప్పారు.


