కర్నూలు: భర్త బాలరాజు దూరమయ్యాడన్న మనస్తాపంతో కర్నూలు శివారులోని సంతోష్ నగర్‌లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నగరానికి చెందిన తెలుగు లక్ష్మీదేవి, తెలుగు రామాంజినేయులు దంపతుల కూతురు తెలుగు రాజేశ్వరికి 10 సంవత్సరాల క్రితం ఓర్వకల్లు మండలం చింతలపల్లె గ్రామానికి చెందిన తెలుగు బాలరాజుతో వివాహమైంది. బాలరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి ఏడాది క్రితం రాజేశ్వరి భర్తను వదిలేసి ఇద్దరు కూతుర్లతో కలసి కర్నూలులోని సంతోష్ నగర్‌లో ఉంటూ చుట్టు పక్కల హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగించేది. తన సంసారం చెడిపోయిందని అప్పుడప్పుడు తల్లితో చెప్పి బాధ పడేది. పెద్దలతో మాట్లాడి సర్దుబాటు చేస్తామని తల్లి నచ్చజెప్పేది. అయితే, గురువారం జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజేశ్వరి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఈ విషయం తల్లికి తెలిసి కుటుంబ సభ్యులతో కలసి తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కేంద్రానికి తరలించారు.


