కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఏడు స్థాయీ సంఘాల్లో భాగంగా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు ఆర్థిక ప్రణాళిక శాఖలపై సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశాలకు ఆయా స్థాయీ సంఘాల చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.
చదువుతో ఉజ్వల భవిష్యత్తు
ఆదోని అర్బన్: చదువుతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని తమిళనాడు రాష్ట్ర ఐఏఎస్ అధికారిణి ఎల్.అంబికాజైన్ పేర్కొన్నారు. శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ కో ఆపరేటివ్ బ్యాంకు వారి సౌజన్యంతో 53 మంది విద్యార్థులకు బంగారు పతకాలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. బ్యాంకు చైర్మన్ రాయచోటి రామయ్య, డివిజనల్ కో ఆఫీసర్ (ఎఫ్‌ఏసీ) డి.శిరీష, బీఓఎం చైర్మన్ రాయచోటి సుబ్బయ్య, వైస్ చైర్మన్ బి.లక్ష్మీనారాయణశెట్టి తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు నిలిచిన ఇన్‌ఫ్లో
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి వచ్చి చేరే వరద ప్రవాహం శుక్రవారం పూర్తిగా నిలిచిపోయింది. ఎగువన వర్షాలు లేకపోవడం, నీటిమట్టం కూడా తగ్గుతుండడంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తెలంగాణ ప్రాంతానికి అవసరమైన విద్యుత్‌లో కొంత భాగం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. గురువారం నుంచి శుక్రవారం వరకు ఎడమగట్టు కేంద్రంలో 11.929 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జునసాగర్‌కు 24,226 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 8,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,050 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 156.0124టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 873.40 అడుగులకు చేరుకుంది.
గ్రామాల్లో చిన్నారులకు విషజ్వరాలు
వెల్దుర్తి: గ్రామాల్లో చిన్నారులు విషజ్వరాల బారిన పడుతున్నారని జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, ఏఎమ్‌ఓ విజయ్‌కుమార్ గుర్తించారు. వెల్దుర్తి సీహెచ్‌సీకి శుక్రవారం వచ్చి అక్కడ నమోదవుతున్న కేసుల వివరాలు సేకరించారు. అనంతరం ఆయా గ్రామాలకు వెళ్లి పారిశుద్ధ్య పనులు చేయించారు. రామళ్లకోట, గోవర్ధనగిరి పీహెచ్‌సీల వైద్యాధికారులు భువనతేజ, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
పత్తి పంటను తొలగించాలి
● వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు
కర్నూలు(అగ్రికల్చర్): కొన్ని ప్రాంతాల్లో పంట దిగుబడి సామర్థ్యం అతి తక్కువగా ఉంటుందని, పంటను తొలగించి జొన్న, ఇతర పంటలు సాగు చేసుకోవాలని రైతులకు ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. కల్లూరు మండలంలోని చిన్న కొట్టాల, పెద్దకొట్టాల, కే మార్కాపురం తదితర గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రెండు నెలలుగా వానలు లేక మొక్కల్లో ఎదుగుదల లేనట్లు గుర్తించారు. పూత రాలిపోవడం వంటి పరిస్థితులను వస్తాయని సెప్టెంబరులో పత్తి పంటను తొలగించాలని రైతులకు సూచించారు. కంది పంట ఎండిపోతున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. శాస్త్రవేత్తలు డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ వి.జయలక్ష్మి, రాఘవేంద్ర చౌదరి, బాలాజీనాయక్, అశోక్‌కుమార్, నరసింహులు పాల్గొన్నారు.


