టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

కర్నూలు (టౌన్‌) : టిప్పర్‌ ఢీకొనడంతో ఒక యువకుడు మృతిచెందాడు. కర్నూలు నగరంలోని బుధవారపేటకు చెందిన బందీ పరమేష్‌ (25) వృత్తిరీత్యా సెంట్రింగ్‌ పని చేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంటి నుంచి తన స్నేహితుడు గణేష్‌ను కూర్చోబెట్టుకుని ద్విచక్ర వాహనంలో బిర్లా గడ్డలోని కాంట్రాక్టర్‌ను కలిసేందుకు వెళ్లాడు. పని విషయమై మాట్లాడుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో స్థానికంగా కొత్త అయ్యప్ప స్వామి గుడి దగ్గర్లోని అగ్రసేని హాస్పిటల్‌ టర్నింగ్‌ వద్ద టిప్పర్‌ వాహనం (ఏపీ39 డబ్ల్యూ ఎన్‌ 0378) డ్రైవర్‌ వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బందీ పరమేష్‌ తీవ్ర గాయాలకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మిత్రుడికి కుడి కాలు స్వల్ప రక్తగాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో ఆటోలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. క్యాజువాలిటీ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయాడని వెల్లడించారు. మృతుని తండ్రి హుసేనయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో నలుగురికి జైలు శిక్ష

డోన్‌ రూరల్‌: వివిధ ప్రాంతాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్ష పడింది. మరో నలుగురికి ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించారు. డోన్‌ రూరల్‌ స్టేషన్‌ పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓబులాపురానికి చెందిన వీ.రమేష్‌కు రెండు రోజుల శిక్ష, రామదుర్గానికి చెందిన సూరన్నకు 10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం డోన్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు డోన్‌ రూరల్‌ సీఐ రాకేష్‌, ఎస్‌ఐ మమత తెలిపారు. డోన్‌ పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన వెల్దుర్తి మండలం గువ్వలకుంట్ల గొల్ల శేఘుకు మూడు రోజులు జైలు శిక్ష, కృష్ణగిరి మండలం చిట్యాలకు చెందిన గుడిసె మద్దిలేటి నాయుడుకు రెండు రోజులు జైలు శిక్ష విధించారు. అలాగే వీ.నగేష్‌,కే రాజు,సీ కల్యాణ నాయుడుకు జడ్జి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించినట్లు సీఐ ఇంతీయాజ్‌ బాషా, ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ తెలిపారు.

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల పట్టణంలో వై జంక్షన్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన హుస్సేన్‌ సాహెబ్‌కు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ సెకండ్‌ క్లాస్‌ న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement