సి.బెళగల్: గుప్త నిధుల కోసం సి.బెళగల్‌లోని పాడుబడిన ఇంట్లో తవ్వకాలు జరిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు శనివారం సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా 10 అడుగుల లోతులో భారీ గొయ్యి, తవ్వకాలకు వాడిన పనిముట్ల కనిపించాయి.గొయ్యి తవ్విన ఇంటి పరిసరాల్లో పసుపు, కుంకుమ చల్లి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. మరో పాత గదిలో తవ్వి మధ్యలో వదిలేసిన గొయ్యి కనిపించింది. ఇంటి యజమాని ఆదేశాల మేరకు కూలీలు గొయ్యి తవ్విన గదిలోకి వెళ్లే కిటికీకి అడ్డుగా గోడను నిర్మాంచారు. పాడుబడిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపి గుప్తనిధులు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో వాస్తవం వెలుగుచూడాల్సి ఉంది.
ముచ్చుమర్రి పంప్‌హౌస్‌కు చేరిన కృష్ణా జలాలు
పగిడ్యాల: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద జలాలు పోటెత్తాయి. ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రస్తుతం నీటి మట్టం 871.70 అడుగులకు చేరుకుంది. దీంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ జలకళ సంతరించుకుంది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ రెండు మోటర్ల ద్వారా కేసీ కాలువకు కృష్ణా జలాలు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో సెప్టెంబర్ 2 నుంచి వంద సీజనల్ హాస్టళ్లను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వలసలు వెళ్లే కుటుంబాల పిల్లల విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలుగకుండా 2026–27 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


