● కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
కర్నూలు కల్చరల్: యూనివర్సిటీల్లో దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (కాంట్రాక్ట్ అండ్ టైం స్కేల్) అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పి.నాగరాజు, డాక్టర్ బి. సాయినాథ్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం వర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన తరువాతనే రెగ్యుర్ నియామకాలు చేపట్టాలన్నారు. ఏళ్ల తరబడి పనిచేయించుకొని ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తమను అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పరిగణించకపోవడం దారుణమన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తరువాతనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు డాక్టర్ రఘునాథ రెడ్డి, డాక్టర్ శరత్‌మనోహర్ బాబు, జాయింట్ సెక్రటరీలు డాక్టర్ సునీత, డాక్టర్ శివశంకర్ యాదవ్, కోశాధికారి డాక్టర్ సురేంద్ర, సభ్యులు పాల్గొన్నారు.


