శ్రీశైలంప్రాజెక్ట్: అనంత్ అరణ్య ప్రాజెక్ట్ కింద గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో జరుగుతున్న పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తిచేయాలని అధికారులను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పీవీఎస్ నాయుడు ఆదేశించారు. నంద్యాల, మార్కాపురం, పల్నాడు జిల్లాల గిరిజన సంక్షేమ సిబ్బందితో గురువారం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీబీ–జీ రామ్‌జీ (చెంచు) క్షేత్రస్థాయి సిబ్బందితో ఉపాధి హామీ పనులపై చర్చించారు. గిరిజన గూడేలలో ఉపాధి పనుల కల్పన, వేతన చెల్లింపులు, పనిదినాలలో కల్పించిన లక్ష్యాల ఛేదన వంటి విషయాలపై చర్చించారు. చెంచు గిరిజన కుటుంబాలకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా కావలసిన పనులను గుర్తించాలని ఆదేశించారు. పీఎం జన్మన్ కింద చేపడుతున్న గృహ నిర్మాణాల కుటుంబాలకు 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పండ్ల తోటలు వేయించి సుస్థిర ఆస్తుల కల్పన చేయించాలన్నారు. సమావేశంలో మూడు జిల్లాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.


