శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆగస్టు 13వ తేదీ నుంచి శ్రావణమాసోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం శ్రావణమాసోత్సవాల ఏర్పాట్లపై అర్చకస్వాములు, వేదపండితులు, డిప్యూటీ ఈఓ, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఇంజనీరింగ్ అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాలు ముందస్తు ప్రణాళికలతో ఉత్సవ నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, క్యూ కంపార్ట్‌మెంట్లలో తాగునీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించాలన్నారు. లడ్డూప్రసాదాల కొరత లేకుండా చూసు కోవాలన్నారు. సామూహిక వరలక్ష్మీవ్రతం, శ్రావణ అఖండ శివనామ భజనలకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలన్నారు.
అమ్మవారికి
బంగారు గాజుల సమర్పణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు దంపతులు బంగారు గాజులు సమర్పించారు. గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. బంగారు గాజులతో పాటు నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి రూ.3లక్షల విరాళాన్ని కూడా అందజేశారు. బంగారు గాజుల మొత్తం బరువు 186 గ్రాములు ఉంటుందని, వీటి విలువ సుమారు రూ.27లక్షలకు పైగా ఉంటుందని దాతలు తెలిపారు. అనంతరం దాత సిద్ధా రాఘవరావు దంపతులకు వేదాశీర్వచనముతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందజేసి సత్కరించారు.


