● లోనీ ఫార్మర్స్‌కు
వ్యవసాయ అధికారి సూచన
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతులు బ్యాంకు ద్వారానే వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణం తీసుకొని.. మీ సేవ సెంటర్లలో ప్రీమియం చెల్లించిన రైతులు ఈ నెల 24లోగా ఆప్ట్ అవుట్ ఫారం సమర్పించాలని సూచించారు. ఏ పంటకై తే ప్రీమియం చెల్లించారో.. అదే పంట ఈ–క్రాప్‌లో విధిగా నమోదై ఉండాలన్నారు. అలాంటి రైతులు మాత్రమే పంటల బీమా పరిహారానికి అర్హులన్నారు. వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు.
మరో లక్ష ఎకరాలను సాగులోకి తేవాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పీఎండీఎస్ కింద మరో లక్ష ఎకరాలను సాగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం పీఎండీఎస్(ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) అంశంపై కలెక్టర్ వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో వెబెక్స్‌లో మీట్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు లాభదాయకమైన సాగు విధానాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 80 వేల ఎకరాల్లో పంటలు సాగైన నేపథ్యంలో మరో లక్ష ఎకరాలను రైతులు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో వారా నికి 50 ఎకరాలు కచ్చితంగా పీఎండీఎస్ విధానంలో సాగు చేయించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మీ, జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
నేటితో ఎస్‌ఐఆర్ ఇంటింటా సర్వే పూర్తి
● 31న డ్రాఫ్ట్ రోల్ విడుదల
కర్నూలు(సెంట్రల్): ఎస్‌ఐఆర్‌లో భాగంగా బీఎల్‌ఓలు చేపట్టిన ఇంటింటా సర్వే శుక్రవారంతో ముగుస్తోంది. జిల్లాలోని 20,86,199 మంది ఓటర్లను బీఎల్‌ఓలు ఇంటింటా కలసి వారి 2002 సర్, 2025 జాబితా వివరాలను సరిపోల్చి ఈసీఐ నెట్‌లో అప్‌లోడ్ చేశారు. జూలై 31వ తేదీన డ్రాఫ్ట్‌రోల్‌ను విడుదల చేస్తారు. ఇదిలాఉంటే అనామలీస్ ఫారాల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గ, మండలాల వారీగా అనామలీస్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిన రెండు రెండు రోజుల్లో అనామలీస్ శాతాన్ని 16–17 శాతానికి తగ్గించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ నూరుల్ ఖమర్, కర్నూలు మునిసిపల్ కమిషనర్ ఓబులేసు, పత్తికొండ, ఆదోని, కర్నూలు ఆర్‌డీఓలు ఓబులేసు, అరుణాదేవి, సందీప్‌కుమార్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,580
ఆదోని అర్బన్: ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగకాయల ధర గురువారం క్వింటా రూ.8,580 పలికింది. యార్డుకు రైతులు 4,709 సంచులు అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ.8,580, మధ్య ధర రూ.7,456, కనిష్ట ధర రూ.3,499 నమోదైంది. అదేవిధంగా పత్తి 14 క్వింటాళ్లు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.9,550, కనిష్ట ధర రూ.9,050 పలికింది.
మొక్కలను సంరక్షించుకుందాం
కర్నూలు కల్చరల్: మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ శాఖ అధికారి శ్యామల అన్నారు. గురువారం నగర శివారులోని జగన్నాథ గట్టుపై అటవీ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్‌తో సీడ్‌బాల్స్ చల్లడం కార్యక్రమాన్ని డీఎఫ్‌ఓ శ్యామల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిసి సుమారు 30వేల సీడ్ బాల్స్‌ను చల్లినట్లు చెప్పారు. వీటి ద్వారా వచ్చిన మొక్కలను సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ కర్నూలు, ఆదోని రేంజ్ ఎఫ్‌ఆర్‌వోలు ప్రియాంక రెడ్డి, తేజశ్వి, డీఆర్‌వో ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.


