కోడుమూరు రూరల్: కలెక్టర్ గారూ.. మీరైనా మా ఊరి నీటి సమస్యను పరిష్కరించండని బుధవారం కోడుమూరులో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరితో స్థానిక మహిళలు మొరపెట్టుకున్నారు. పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, వారం రోజులకోసారి తమ కాలనీలకు నీళ్లు వదులుతున్నారని, అవి కూడా రంగు మారి వాసన వస్తున్నాయని కలెక్టర్‌తో వాపోయారు. సమస్య పరిష్కరించాలని ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదని, ఏళ్ల తరబడి నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.


