● అంగన్‌వాడీ సిబ్బందిపై
ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆగ్రహం
గోనెగండ్ల: సెలవు చీటీలో తేదీలు దిద్దడం ఏంటని అంగన్‌వాడీ సిబ్బందిపై ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోనెగండ్లలోని 8వ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల హాజరు రిజిష్టరు, స్టాక్ రిజిష్టర్లను తనిఖీ చేశారు. సూపర్ వైజర్లు ఎన్ని రోజులకు ఒకసారి పర్యవేక్షణకు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తారని ప్రశ్నించి రికార్డులను పరిశీలించారు. రిజిష్టర్‌లో సూపర్‌వైజర్ ఏప్రిల్ నెలలో ఒకసారి మాత్రమే వచ్చి సంతకం చేసినట్లు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పరిశీలించగా అవి గడువుతీరి ఉండడంతో మండిపడ్డారు. వెంటనే వాటిని బయట పారవేయాలని సూచించారు. ఇలాంటి పనులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. కర్నూలు డిప్యూటీ డీఈఓ శ్రీధర్ బాబు, ఐసీడీఎస్ సిబ్బంది, ఎంఈఓ రామాంజనేయులు పాల్గొన్నారు.


