ఇన్‌చార్జ్‌లుగా ఆదోని సబ్‌కలెక్టర్, పత్తికొండ ఆర్‌డీఓ
11 మంది తహసీల్దార్ స్థానాల్లో డీటీలకు బాధ్యతలు
పత్తికొండ డివిజన్‌లో ముగ్గురు మాత్రమే రెగ్యులర్ తహసీల్దార్లు
తహసీల్దార్ల పదోన్నతులపై రెండుళ్లుగా ఊరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
మనోవేదనకు గురవుతున్న ఉద్యోగులు
కర్నూలు(సెంట్రల్): రెవెన్యూ సిబ్బంది పనిభారంతో సతమతవుతున్నారు. ఒక బాధ్యతతో నాలుగైదు విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవులో వెళ్లాలన్నా కుదరకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. దీంతో రెవెన్యూ శాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన సాగుతోంది. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, పత్తికొండ రెవెన్యూ సబ్‌డివిజన్లలో ఇన్‌చార్జ్ అధికారులు ఉన్నారు. ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆదోని సబ్‌కలెక్టర్ పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో ఈ బాధ్యతలను హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–3 సబ్ కలెక్టర్ అజయ్ చంద్రశేఖర్‌కు అప్పగించారు. పత్తికొండ ఆర్‌డీఓగా పనిచేస్తున్న భరత్ నాయక్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసి జీఏడీలో రిపోర్టు చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన తన బాధ్యతలను సబ్ కలెక్టర్ కొండయ్యకు అప్పగించి వెళ్లిపోయారు.
తహసీల్దార్ల స్థానంలో డీటీలకు బాధ్యత
కర్నూలు, ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో చాలా తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిప్పగిరి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి, ఎమ్మిగనూరు, కోడుమూరు,, పెద్దకడబూరు, కౌతాళం, హొళగుంద, హాలహర్వి, కృష్ణగిరి మండలాలకు తహసీల్దార్లు లేరు. వారి స్థానంలో డీటీలకు బాధ్యతలు అప్పగించారు. పత్తికొండ డివిజన్‌లో పత్తికొండ, తుగ్గలి, ఆలూరు తప్ప మిగతా అన్ని మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లు లేరు. ఒక్క ఎమ్మిగనూరుకు మాత్రం నందవరం తహసీల్దార్‌కు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆయన నందవరం, ఎమ్మిగనూరు మండలాలకు తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు.
పదోన్నతులు లేనట్టేనా?
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రెవెన్యూలో పదోన్నతుల ఫైల్ కదలడంలేదు. ఈ క్ర మంలో రిటైర్‌మెంట్లు, సస్పెన్షన్ల ద్వారా ఏర్పడుతు న్నా ఖాళీల పోస్టులను ఇన్‌చార్జ్‌లకు అప్పగించి చే తులు దులుపుకుంటున్నారు.జిల్లాలో మొత్తం రెండు ఆర్‌డీఓ,11 తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్లకు సబ్ కలెక్టర్/ఆర్‌డీఓ, డిప్యూ టీ తహసీల్దార్లకు తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్లు/ఆర్‌ఐలకు డిప్యూటీ తహసీల్దార్లు, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్/ఆర్‌ఐలుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను కారుణ్య నియమకాల ద్వారా భర్తీ చేయవచ్చు. అయితే ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
అడ్‌హక్ పదోన్నతులకు బ్రేక్!
ఇటీవల కర్నూలు జిల్లాలో ఖాళీగా 11, నంద్యాల జిల్లాలో ఖాళీగా ఉన్న 10 తహసీల్దార్ పోస్టులకు అడహక్ పదోన్నతుల కోసం కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సీసీఎల్‌ఏకు నివేదించారు. మొదట అక్కడ అడహక్ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా అడహక్ పదోన్నతులకు రెడ్ సిగ్నల్ ఇచ్చి బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ పద్ధతిలోనే తహసీల్దార్ పదోన్నతులను ఇవ్వనున్నట్లు సీసీఎల్‌ఏ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయింది. అయితే అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో పదోన్నతులపై దృష్టి సారించడంలేదు. దీంతో ఇన్‌చార్జ్‌లతో పాలన ముందుకు సాగడం లేదు. ఒకవైపు రీసర్వే.. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గుట్టలు గుట్టలుగా వినతులు వస్తున్నాయి. ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పూర్తి స్థాయి బాధ్యతల్లో పనిచేయాలని వీరిని అనధికారికంగా ఒత్తిడి వేయడంపై ఆవేదన చెందుతున్నారు. కొందరు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించలేక అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో చాలా మంది అధికారులు సెలవులో వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.


