ముక్క లెక్క తప్పితే.. చిక్కులే
కర్నూలు(హాస్పిటల్): కంచంలో ముక్క లేనిదే ముద్దదిగని పరిస్థితి కొందరిది. ఎక్కడైనా ఫంక్షన్లలో మాంసాహారం, శాఖాహారాలు వేర్వేరుగా ఏర్పాటు చేస్తే మాంసాహారం వద్దే ఎక్కువగా భోజనప్రియులు బారులు తీరి ఉంటారు. మాంసాహారంలో పోషకాలు అధికంగా ఉంటాయన్నది ఎంత నిజమో అంతకుమించి క్యాలరీలు, కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసాహారం అధికంగా తింటే స్థూలకాయంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులనూ తెచ్చిపెడుతున్నాయంటున్నారు. జిల్లాలో మాంసాహార ప్రియుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ వైరస్ విజృంభణ అనంతరం ఇది మరింత పెరిగింది. కోవిడ్ సమయంలో ప్రొటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ప్రచారం సాగడంతో చాలా మంది అతిగా నాన్‌వెజ్‌ను తిన్నారు. ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. పండగొచ్చినా, పబ్బమొచ్చినా సరే మాంసాహారం ఉండాల్సిందేననే పరిస్థితికి చేరుకుంది. గతంలో కొన్ని వర్గాల వారు వివాహాల్లో శాఖాహారం మాత్రమే వడ్డించేవారు. కానీ వివాహాల్లో కూడా మాంసాహారాన్ని ఏర్పాటు చేసే సంస్కృతి ప్రారంభమైంది. గ్రామదేవతలకు మొక్కులు చెల్లించడం కూడా అధికమైంది. ఇలాంటి సమయంలో మాంసాహారం, మద్యపానం తప్పనిసరిగా మారింది. ఫలితంగా మాంసాహారాన్ని తరచూ తినేవారి సంఖ్య ఎక్కువైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాంసాహారాన్ని విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డుసైడు వ్యాపారాలు చేసే వారి సంఖ్య 16వేలకు పైగానే ఉంటుందని అంచనా. ఆయా కేంద్రాల్లో ప్రతిరోజూ రూ.4 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని సమాచారం. ముఖ్యంగా కర్నూలు నగరంతో పాటు కోడుమూరు, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె వంటి చోట్ల నాన్‌వెజ్ హోటళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రోడ్డుపక్కన కేవలం చిరుతిండ్లు, బజ్జీల కొట్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు నాన్‌వెజ్ ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా వెలుస్తున్నాయి.
డోర్‌డెలివరీలూ ఎక్కువే..!
కోవిడ్ మనిషికి డోర్ డెలివరీని అలవాటు చేసింది. అప్పట్లో ప్రజలు ఎక్కువగా గుమికూడదన్న ఉద్దేశంతో ఈ విధానానికి అనుమతించారు. ఇప్పుడిదే సంస్కృతిగా మారిపోయింది. మనసులో కోరిక పుట్టిందో లేదో వెంటనే అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌ను తెరిచి ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇతర వస్తువుల కంటే ఆహార పదార్థాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలను డోర్‌డెలివరీ చేసే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు వచ్చాక డోర్ డెలివరీలు మరింత ఎక్కువయ్యాయి. ఇలా డోర్ డెలివరీ ద్వారా తెచ్చుకున్న ఆహారంలో వివిధ బిర్యానీలదే అగ్రస్థానం.
అతిగా తింటే ఊబకాయం
ప్రతి చిన్న విషయానికి నాన్‌వెజ్ తీసుకోవడం ఎక్కువై పోవడంతో మనిషి తీసుకునే క్యాలరీలకు, ఖర్చయ్యే క్యాలరీలకు పొంతన ఉండటం లేదు. ఈ ప్రభావంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతోంది. ఇది దీర్ఘకాలిక వ్యాదులైన బీపీ, షుగర్, గుండెజబ్బులు, మానసిక ఒత్తిళ్లు, క్యాన్సర్‌లకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బిర్యానీలు, ఫ్రైడ్ ఐటమ్స్‌లో నూనె, డాల్డా అధికంగా వాడుతున్నారు. దీనివల్లే శరీరంలో కొవ్వు స్థాయి పెరగడంతో అది కాలేయం, గుండైపె తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఊబకాయం వల్ల శరీరం చలాకీతనం కోల్పోతుంది. ఫలితంగా వారు చేసే పనుల్లో పెద్దగా వృద్ధి కనిపించదు. పిల్లలైతే చదువులో వెనుకబడిపోతారు. బీపీ, షుగర్, గుండె, కాలేయ జబ్బులు, మానసిక ఒత్తిడి వచ్చే ప్రమాదం ఉంది.
జనానికి నాన్‌వెజ్ పైనే
మక్కువ ఎక్కువ
హోటళ్లు, రెస్టారెంట్లలో వీటికే క్రేజ్
ఎప్పుడో ఒకసారైతే సమస్య లేదు
అతిగా తింటే అనారోగ్య సమస్యలు
తప్పవంటున్న వైద్యులు
ఊబకాయం,
జీర్ణకోశ సమస్యలు ఖాయం
ఫలితంగా బీపీ, షుగర్,
గుండె జబ్బులు తప్పవు
ముక్క లెక్క తప్పితే.. చిక్కులే
ముక్క లెక్క తప్పితే.. చిక్కులే
ముక్క లెక్క తప్పితే.. చిక్కులే
ముక్క లెక్క తప్పితే.. చిక్కులే


