రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి
కర్నూలు (సెంట్రల్): రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో మళ్లీ చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నగరంలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చే పనులలో పురోగతిని తీసుకురావడంతో పాటు గడువులోగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. నగరంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ మరమ్మతులు చేయించాలని కర్నూలు మున్సి పల్ కమిషనర్‌ను ఆదేశించారు. నేషనల్ హైవేలో డివైడర్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. రహదారుల వెంట పలు ప్రాంతాల్లో లైటింగ్ లేదని.. పోలీసు, ఆర్‌అండ్‌బీ అధికారులతో వివరాలు తీసుకుని వెంటనే ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. రాళ్లదొడ్డి వద్ద రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి నిధులు మంజూరయ్యాయని, వెంటనే పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. కెపాసిటీకి మించి ప్రయాణికులను తరలించే వాహనదారులపై కేసులు నమోదు చేయాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ అంశంపై డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవాణా, పోలీసు అధికారులను ఆదేశించారు. హిట్ అండ్ రన్‌కి సంబంధించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన కేసులు కర్నూలు ఆర్డీఓ వద్ద ఎక్కువ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. స్టేట్ హైవే అండ్ నేషనల్ హైవే అప్రోచ్ రోడ్లకు సంబంధించి స్పీడ్ బ్రేకర్లు వేసే పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ హుసేన్ పీరా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర రెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు, ఎన్‌హెచ్ పీడీలు, నేషనల్ హైవే ఎస్‌డీసీ సునిత, తదితరులు పాల్గొన్నారు.


