తనిఖీ లో‘పాలు’!
కర్నూలు(అగ్రికల్చర్): పాలు ఆరోగ్యానికి మంచిదంటారు. ఉదయాన్నే గ్లాసు పాలు తాగాలంటారు. ఇప్పుడు మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన సంఘటనలో ఐదుగురు మరణించడమే ఇందుకు ప్రధాన కారణం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు ప్రయివేటు పాల డెయిరీలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. మరోవైపు అనధికారికంగా పాలవ్యాపారం చేసే వ్యాపారులు పెరిగిపోతున్నారు. వీరు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు. ఎన్ని సేకరిస్తున్నారు.. పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే దానిని పరిశీలించే యంత్రాంగమే లేదు. ప్రయివేటు డెయిరీల్లో పాల నాణ్యతపై దృష్టి పెట్టిన దాఖలాలు రెండేళ్లలో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు పాడి పశువులు సేపునకు రావడానికి అడ్డగోలుగా అక్సిటోసిన్ అనే సూదులు వేస్తున్నారు. ఈ ఇంజెక్షన్‌లు వేయడం కూడా ప్రాణాంతకమే. అయితే, దీనిని అరికట్టేవారే కరువు అయ్యారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఫుడ్ సేస్టీ అధికారులు 15 పాల శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పంపారు. ఇందులో అను మిల్క్ డెయిరీకి చెందిన పాల శాంపిల్స్‌లో నాణ్యత లేదని తేలింది. అయితే చర్యలు లేవు. నాణ్యత లేదని తేలినప్పుడు జేసీ కోర్టులో ఫుడ్ సేప్టీ అధికారులు కేసు ఫైల్ చేస్తారు. అక్కడ విచారణ జరిగినా జేసీ జడ్జిమెంటు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఇందులో కూడా జరిమానాతో సరిపుచ్చే అవకాశాలే ఎక్కువ.
ప్రయివేటు డెయిరీల్లో తనిఖీలు చేయని అధికారులు
రాజమహేంద్రంలో జరిగిన సంఘటనకు సంబంధించి శీతలీకరణ యంత్రంలో కూలెంట్‌గా వినియోగించిన ఇథలిన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలువడం వల్లే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఏర్పడి మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు దాదాపు 20 లక్షల పాల వినియోగం ఉంది. ఉత్పత్తి అవుతున్న పాలు కేవలం 10 లక్షల లీటర్ల వరకే. ప్రయివేటు డెయిరీలు, పాల వ్యాపారులు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాల గురించి రెండేళ్లలో తనిఖీలు నిర్వహించిన దాఖలాలే లేవు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ కార్యాలయం ఉంది. పాల నాణ్యత ప్రమాణాలు చూడాల్సిందే ఈకార్యాలయ అధికారులే. అయితే తనిఖీలకు మంగళం పలికి శాంపిల్స్ తీయడానికే వారు పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులకు కూడా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం డెయిరీలను తనిఖీ చేసే అధికారం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పశు సంవర్ధక శాఖ అధికారులు డెయిరీలు, పాల వ్యాపారంపై ఏ నాడు దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజమహేంద్రవరం సంఘటనలతోనైనా పాల వ్యాపారంపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
రెండేళ్లుగా ప్రయివేటు డెయిరీల్లో
తనిఖీలు శూన్యం
శాంపిల్స్ తీయడానికే
పరిమితమవుతున్న ఫుడ్ సేప్టీ
అధికారులు
కల్తీ నిర్ధారణ అయితే జరిమానాలతో
సరిపుచ్చుతున్న వైనం
రాజమహేంద్రవరం సంఘటనతో
ప్రభుత్వం మేలుకొనేనా!


