విద్యార్థులకు భద్రత కరువుపై విచారణ
కర్నూలు: నగరంలోని బండిమెట్టలో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న షేక్ హీనా అనే విద్యార్థినికి నిప్పంటుకుని గాయాలైన సంఘటనపై రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, విద్యా శాఖాధికారి సురేంద్ర ప్రసాద్‌తో కలసి మంగళవారం విచారణ జరిపారు. ‘విద్యార్థులకు భద్రత కరువు’ శీర్షికన ఈనెల 11వ తేదీన ‘సాక్షి’లో వెలువడిన కథనంపై రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు లీలా వెంకటశేషాద్రి విద్యాశాఖ అధికారి సురేంద్ర ప్రసాద్‌తో కలసి పాఠశాలకు వెళ్లి అధ్యాపకులను, విద్యార్థులను విచారించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని గాయపడిన షేక్ హసీనాతో పాటు తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే మాధవీనగర్ నారాయణ హైస్కూల్‌లో తరగతి గదిలో సీలింగ్ ఫ్యాన్ ఊడి విద్యార్థులపై పడిన ఘటనపై కూడా విచారణ జరిపారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులను, అధ్యాపకులను సంఘటనపై విచారించారు. గాయపడిన సాయిచరణ్‌తో పాటు సహచర విద్యార్థులను పరామర్శించారు. ఎవరికై నా న్యాయ సహాయం కావాలంటే ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆయన సూచించారు.
విద్యార్థులకు భద్రత కరువుపై విచారణ


