పోరాటాలను ఉద్ధృతం చేయాలి
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నర్సింగరావు
నంద్యాల(న్యూటౌన్): కార్మిక హక్కుల రక్షణకు పోరాటాలు ఉద్ధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం అధ్యక్షతన ఏఐటీయూసీ రాష్ట్ర 17వ మహాసభల ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా గఫూర్, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, గౌరవాధ్యక్షుడిగా శాంతిరాముడు, కోశాధికారిగా ఏసురత్నం, చీఫ్ ప్యాట్రన్‌గా దస్తగిరిరెడ్డి, మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంతియాజ్ అహమ్మద్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయీమెంట్ పేరుతో ఉద్యోగులకు, కార్మిక వర్గానికి పాలకులు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీస వేతనాలు లేక చాలీచాలని జీతాలతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి పోతుందని, కార్మికులను, కష్ట జీవులతో కారు చవకగా పని చేయిస్తూ పెట్టుబడి, కార్పోరేట్ శక్తులకు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించా రు. కార్మికుల హక్కుల కోసం లేబర్ కోడ్‌ల రద్దుకై ఈనెల 12న జరిగే దేశ వ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో మహిళలను పని చేయాలని నిర్ణయించడం కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. మహిళా ఉద్యోగుల, మహిళా కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌కుమార్, రాజశేఖర్, రామచంద్రుడు, నాగేశ్వరరావు, నరసింహనాయక్, లక్ష్మణ్, బాలవెంకట్, తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.


