మహిళ అనుమానాస్పద మృతి
● పరారీలో భర్త ● అనాథగా మూడేళ్ల చిన్నారి
డోన్: డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీకి చెందిన వివాహిత తెలంగాణ రాష్ట్రం మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి మృతి చెంది, తండ్రి పరారీలో ఉండగా వారి కుమార్తె అనాథగా మిగిలింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని త్రివర్ణకాలనీకి చెందిన పెయింటర్ కుమ్మలపాటి విజయ్‌కుమార్ పెద్దకుమార్తె మణి (25)ని ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని బసవనపల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ధనరాజ్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. రూ.6లక్షల కట్నంతో పాటు 8 తులాల బంగారు, గృహోపకరణాలు పెళ్లి కానుకగా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్‌గిరి జిల్లా పర్వతాపురంలో నివాసం ఉండే వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ధనరాజ్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. భార్య మణిపై అనుమానం పెంచుకున్న ధనరాజ్ వేధిస్తూ రెండు రోజుల క్రితం ఆమె పేరుపై ఉన్న ఇంటి స్థలాన్ని రిజిస్ట్రర్ చేసి ఇవ్వాలని విజయ్‌కుమార్‌పై ఒత్తిడి చేశాడు. మరుసటిరోజే మణి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు ధనరాజ్ ఆమె కుటుంబీకులకు విషయం తెలిపాడు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోలుకోలేక మృతి చెందింది. బుధవారం మృతురాలి మృతదేహానికి డోన్ పట్టణంలోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పో యి, తండ్రి దూరమై రోదిస్తున్న మూడేళ్ల చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని విజయ్‌కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ధన్‌రాజ్‌పై హత్యకేసు నమోదు చేసినట్లు తెలిసింది.
మణి (ఫైల్),అనాథగా మిగిలిన మూడేళ్ల చిన్నారి
మహిళ అనుమానాస్పద మృతి


