రైతు సేవా కేంద్రాల్లో వైద్య సేవలు బంద్
2019లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పశువుల ఆసుపత్రులు కేవలం 338 మాత్రమే ఉన్నాయి. మూగజీవాలకు సరైన వైద్య సేవలు అందడం లేదనే విషయాన్ని గుర్తించిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలలో కూడా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేసింది. ఆ మేరకు రైతుభరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా మందులు సరఫరా అయ్యాయి. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువైద్య కేంద్రాల సంఖ్య 721కి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుభరోసా కేంద్రాల్లో వైద్య సేవలు స్తంభించాయి. వీటికి మందుల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఆర్‌బీకేలకు ప్రత్యేకంగా మందులు ఇవ్వమని.. ఏరియా హాస్పిటల్స్, వెటర్నరీ డెస్పెన్సరీలు, గ్రామీణ పశువైద్యశాలలకు ఇస్తున్న మందుల నుంచే తీసుకోవాలని ఉన్నతాధికారులు ఉచిత సలహా ఇస్తుండటం గమనార్హం. వీటిల్లోనే మందులు లేకపోతే రైతుభరోసా కేంద్రాలకు ఎలా ఇస్తారని పశుసంవర్ధక శాఖ అధికారులు వాపోతున్నారు.


