పసిబిడ్డ కిడ్నాప్ కేసులో ముద్దాయి అరెస్టు
కర్నూలు: నాలుగేళ్ల పసిబిడ్డ కిడ్నాప్ చేసిన కేసులో ముద్దాయి బోయ మధును నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. బాలిక తల్లి తెలుగు సునిత అలియాస్ సుమిత్ర కర్నూలులోని బళ్లారి చౌరస్తా ఎస్‌ఏపీ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో పేపర్లు ఏరుకోవడం, భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈనెల 8న తన కూతురును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తల్లి సుమిత్ర నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పదంగా బాలికతో ఉన్న బోయ మధును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన బోయ మధు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముజఫర్ నగర్ ఆటోస్టాండ్ వద్ద నివాసముంటాడు. నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి భిక్షాటన కోసం విక్రయించేందుకు హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు విచారణలో అంగీకరించాడు. బాలికను తల్లికి అప్పగించి నిందితుడిని డోన్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.


