
మట్టి వినాయకులను పూజిద్దాం
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పీసీబీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వచ్చిన 800 మంది మహిళలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను పర్యావరణానికి హాని కలిగించకుండా జరుపుకోవాలన్నారు. పీసీబీ ఈఈ పీవీ కిశోర్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజలకు పర్యావరణపై అవగాహన కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 3 వేల మట్టి వినాయకులను తయారు చేయించి ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. కర్నూలు సీక్యాంపు సెంటర్‌లోని టీడీపీ కల్యాణ మండపంలో 2200 మట్టి వినాయకులను ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పీసీబీ ఈఈ కిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల
ఽద్రువీకరణ పత్రాల పరిశీలన
కర్నూలు: సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో సోమవారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టారు. మొత్తం 309 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 297 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ సమగ్రంగా కౌంటర్ల వారీగా పరిశీలించారు. అన్ని పత్రాలను సక్రమంగా సమర్పించిన వారిని తదుపరి నియామక దశకు ఎంపిక చేస్తారని తెలిపారు.
నేడు ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల
పత్రాల పరిశీలన
334 మంది ఏపీఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మంగళవారం పత్రాల పరిశీలన ఉంటుంది. మొదటి రోజు హాజరు కాని సివిల్ కానిస్టేబుళ్లు 12 మందికి ఏపీఎస్పీ అభ్యర్థులతో పాటు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీ భాస్కర్ రావు, డీపీఓ ఏఓ విజయలక్ష్మి, ఆర్‌ఐలు, సూపరింటెండెంట్లు, డీపీఓ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
మైనారిటీ విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాలు
కర్నూలు(అర్బన్): నగరంలోని వేంకటాచలపతి నగర్‌లోని మైనారిటీ (బాలురు) విద్యార్థుల పోస్టు మెట్రిక్ ప్రభుత్వ వసతి గృహంలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 2025–26 విద్యా సంవత్సరానికి 25 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ప్రవేశం పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9440822219, 9848864449 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

మట్టి వినాయకులను పూజిద్దాం