
దివ్యాంగులను వేధించడం అన్యాయం
కర్నూలు(సెంట్రల్): పింఛన్లు తొలగించి దివ్యాంగులను రాష్ట్రప్రభుత్వం వేధించడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ అన్నారు. జిల్లాలో తొలగించిన 8,300 దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వందలాది మంది దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. వెంటనే దివ్యాంగుల పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని ఆపకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమించాల్సి వస్తుందన్నారు. గతంలో వికలత్వం ఉందని ఇచ్చిన వైద్యులు..ఇప్పుడు ఎందుకు లేదని చూపుతున్నారో అర్థం కావడంలేదన్నారు. కేవలం ప్రభుత్వం చెప్పినట్లు వికలత్వాన్ని తగ్గించి దివ్యాంగుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ అఽధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క దివ్యాంగ పింఛన్ తొలగించలేదని, లక్షలాది మందికి పింఛన్ మంజూరు చేసి భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాకు వినతిపత్రం సమర్పించారు. వీరాంజనేయులు, భాస్కర్, చంద్రశేఖర్, హనుమంతప్ప, నాగరాజు, నాయక్, శివరంజని, నిర్మల, ఎర్రిస్వామి, విజయ్‌కమార్, ఎం.నరసింహులు, రాజేశ్వరి, సురేష్, విజయలక్ష్మీ, శ్వేత, కిష్టప్ప, జాఫర్, ఎర్రస్వామి, రోజీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో తొలగించిన 8,300
దివ్యాంగుల పింఛన్లు వెంటనే
పునరుద్ధరించాలి
వైఎస్‌ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం
ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా