
పొరపాట్లకు తావివ్వొద్దు
● జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
ఓర్వకల్లు: మెగా డీఎస్సీ 2025కు సంబంధించి అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనలో ఏవిధమైన పొరపాట్లకు తావివ్వకూడదని అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా ఆదేశించారు. నన్నూరు టోల్‌ప్లాజా వద్ద శ్రీనివాస బీఎడ్ కళాశాల, రాఘవేంద్ర బీఎడ్ కళాశాలలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌తో పాటు, కర్నూలు, నంద్యాల జిల్లాల డీఈఓలు శామ్యూల్ పాల్, జనార్దనరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో సర్టిఫికెట్ల పరిశీలన కీలకమైందన్నారు. సబ్జెక్టు వారీగా ఏర్పాటు చేసిన గదులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఎంత మంది అభ్యర్థులు హాజరుకానున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలనలో వచ్చే ఇబ్బందులతోపాటు వాటిని ఎలా అధిగమించాలో విద్యాశాఖ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం 54 బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ చెప్పారు. అదనంగా మరో కొన్ని బృందాలు ఉన్నాయన్నారు. ఎంపిక జాబితా రాష్ట్రం నుంచి విడుదల కావాల్సిన నేపథ్యంలో ఏ క్షణాన వెరిఫికేషన్‌కు ఆదేశాలు వస్తాయో వెంటనే నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.