
ఉరుకుంద ఈఓ విజయరాజుపై బదిలీ వేటు
మంత్రాలయం: ఉరుకుంద ఈరన్న క్షేత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడిపల్లి విజయరాజుపై బదిలీ వేటుపడింది. గుంతకల్లులోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఈఓగా ఆయనను బదిలీ చేశారు. అక్కడ ఈఓగా పని చేస్తున్న కె.వాణి ఉరుకుంద ఈరన్న ఆలయ ఈఓగా నియమితులయ్యారు. విజయరాజు గత ఏడాది సెప్టెంబర్ 24న ఇక్కడ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. తన సూసైడ్ నోట్‌లో ప్రధాన అర్చకుడు, వేదపండిట్ మాటలు విని ఈఓ తనతో పాటు ఇతర అర్చకుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈఓ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే కాంట్రాక్టర్ల అక్రమార్జనకు అడ్డుపడుతున్నాడనే కారణంతో రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆయనపై బదిలీ వేటు వేసినట్లుగా చర్చ జరుగుతోంది. గతంలో ఈఓగా పని చేసిన హెచ్.జి.వెంకటేష్ కూడా అర్చకుల తట్టను తీయించి ఆలయ ఆదాయాన్ని పెంచడానికి శాఖాపరమైన నిర్ణయం తీసుకోవడం ఆయన బదిలీకి కారణమైంది. అప్పట్లో ఆయనను కూడా ఉత్సవాల వేళనే బదిలీ చేయడం గమనార్హం. తాజాగా విజయరాజు కూడా అదే తరహాలోనే బదిలీ అయినట్లు సమాచారం.
నూతన ఈఓగా కె.వాణి
కె. వాణి