
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ మాజీ కౌన్సిలర్లు
ఎమ్మిగనూరుటౌన్: పట్టణానికి చెందిన 3వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ కనికె లక్ష్మీదేవి, ఆమె కుమారుడు టీడీపీ పట్టణ ఇన్‌చార్జ్ చేనేత మల్లికార్జున, 30వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మధుబాబు తమ అనుచరులతో గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో వారు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టారేణుక సమక్షంలో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుట్టా రేణుకతో పాటు పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టాప్రతుల్, సీనియర్ నాయకుడు బుట్టా శివ నీలకంఠ వారికి కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మధుబాబు మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో ఇద్దరి ఎమ్మెల్యేల పాలన సాగుతుందని షాడో ఎమ్మెల్యేని ఉద్దేశించి విమర్శలు చేశారు. చేనేత మల్లికార్జున మాట్లాడుతూ.. ఎమ్మిగనూరుకు చేనేతల కోసం క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని బుట్టారేణుకను కోరారు. టెక్స్‌టైల్ పార్క్‌తో చేనేతలను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యే బీవీ పట్టణంలో భూమి పూజ చేశారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమ పాలనలో ప్రజలు బాగుపడ్డారని, టీడీపీ ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించడంతో తాము వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.