కూరగాయల సాగుకు తగ్గిన ప్రోత్సాహం
● సబ్సిడీపై విత్తనాల పంపిణీ సున్నా
● గత ఏడాది 6,976 ఎకరాల్లో
కూరగాయల సాగు
● అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
● భారీగా పెరుగుతున్న ధరలు
● ఉక్కిరిబిక్కిరి అవుతున్న
వినియోగదారులు
కర్నూలు(అగ్రికల్చర్): నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కూరగాయల సాగుకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడం ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రసుత్తం మార్కెట్‌లో కూరగాయల ధరలు మండుతున్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు పండించిన ధాన్యం, వేరుశనగ, కందులు, కొర్రలు, సజ్జలతో సహా కూరగాయలు అమ్మడానికి పోతే తక్కువ ధరలు లభిస్తున్నాయి. కొనడానికి పోతే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా రైతులకు సాగు భారమవుతోంది. డిమాండ్‌కు తగినట్టు మార్కెట్‌లోకి కూరగాయల సరఫరా లేకపోవడం కొరతకు కారణమవుతోంది. అంతంతమాత్రం సాగు చేసిన కూరగాయల పంటలు కూడా అకాల వర్షాలకు దెబ్బతింటుండటంతో దిగబడులు పడిపోయాయి. గత మూడు, నాలుగేళ్లతో పోలిస్తే రబీ కూరగాయల సాగు పడిపోయింది. వేసవిలో కూరగాయల కొరత ఉత్పన్నం కాకుండా సమ్మర్ క్రాప్స్‌ను ప్రోత్సహించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఫలితంగా కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి.
కలసిరాని కూరగాయల సాగు
రైతుల్లో కూరగాయల సాగుపై ఆసక్తి తగ్గిపోతోంది. 2023–24 ఈక్రాప్ ప్రకారం ఉల్లి, టమాట సహా కూరగాయల సాగు 80,614 ఎకరాల్లో ఉంది. వీటిని మినహాయిస్తే కూరగాయల పంటలు 31,868 ఎకరాల్లో సాగయ్యాయి. సాగు పుష్కలంగా ఉండటంతో కూరగాయల కొరత ఏర్పడలేదు. ధరలు పెరిగిన దాఖలాలు లేవు. 2024–25 సంవత్సరంలో టమాట, ఉల్లితో సహా కూరగాయల సాగు 26,087 ఎకరాల్లో ఉంది. ఉల్లి, టమాట పంటలే 22,736 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ పంటలను మినహాయిస్తే కేవలం కూరగాయల పంటలు 3,351 ఎకరాలకే పరిమితం అయ్యాయి. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో కూరగాయల సాగు కలసి రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతంతమాత్రం సాగైన పంటలు కూడా అధిక వర్షాలు, అకాల వర్షాలతో దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడులు పడిపోయి కొరత ఏర్పడటం ధర పెరుగుదలకు కారణమవుతోంది.
టమాట ధర పెరిగే అవకాశం
గత ఏడాది మే నెలతో పోలిస్తే కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమాట, బెండ ధరలు మాత్రమే ఊరట కలిగిస్తున్నాయి. రానున్న రోజుల్లో టమాట ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం టమాట సాగు పూర్తిగా పడిపోయింది. మదనపల్లి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి టమాట దిగుమతి అవుతోంది. అక్కడ కూడా పంట క్రమంగా తగ్గుతోంది. దీంతో రానున్న రోజుల్లో టమాట ధరలు కూడా పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వెల్దుర్తి, కోడుమూరు, క్రిష్ణగిరి, గూడూరు, సీ.బెళగల్, డోన్ తదితర ప్రాంతాల్లో కూరగాయల ధర మండుతోంది. చాలాచోట్ల కూరగాయల ధరలు రూ.100 వరకు చేరాయంటే ఆశ్చర్యం కలుగకమానదు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
● కూరగాయల కొరత ఏర్పడకుండా సాగును ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
● కూటమి ప్రభుత్వంలో కూరగాయల సాగుకు ఎ లాంటి ప్రోత్సాహం లభించని పరిస్థితి నెలకొంది.
● సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూరగాయల సాగుకు ప్రోత్సాహకాలు ఉన్నా ఆచరణలో అమలు కావడం లేదు.
● 50 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉన్నా 2024–25 సంవత్సరంలో ఒక్క రైతుకు కూడా విత్తనాలు ఇవ్వకపోవడం గమనార్హం.
ధరల పెరుగుదల ఇలా..
కూరగాయ ఏప్రిల్ మే
పేరు 11న ధర 11న ధర
వంకాయ 16/24 34/48
కాకర 30 54
క్యాలీఫ్లవర్ 30 44
క్యారెట్ 24 40
బీన్స్ 80 100
చిక్కుడు 50 70
క్యాప్సికం 50 64
పచ్చిమిర్చి 30 54
బీర 36 50


