
ఇంగ్లిషులో మాట్లాడేలా తీర్చిదిద్దాలి
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సులభంగా తెలుగు మాట్లాడినట్లు ఇంగ్లిషులో కూడా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని విల్ టు కేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లిషు ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ శామ్యూల్‌పాల్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణకు జిల్లాలో దాదాపు 450 మంది ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. వారికి ఇంగ్లిషు బోధనలో పలు మెళకువలు, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంగ్లిషులో పూర్తి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విల్ టు కేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ ప్రతినిధులు వేణుగోపాల్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.