Nara Lokesh 40 Days Yuvagalam Padayatra - Sakshi
Sakshi News home page

వద్దంటే వినకపోతివి.. లోకేశ్‌

May 24 2023 7:10 AM | Updated on May 24 2023 9:20 AM

- - Sakshi

కర్నూలు: యువగళం పాదయాత్ర జిల్లాలో 40 రోజుల పాటు సాగిందంట. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్‌ పాదయాత్ర చేశారంట. నిజమేనా? అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ నేతలు ఏదో ఊహించుకుంటే, ఇక్కడ ఏదో జరిగింది. జనం నుంచి స్పందన లేక.. మాట్లాడే మాట అర్థం కాక.. ఫ్లెక్సీల మధ్య వంద మంది జనంతో సభలను మమ అనిపిస్తూ.. ఈవినింగ్‌ వాక్‌ను తలపించే పాదయాత్ర జిల్లాలో నవ్వులపాలైంది. అడుగడుగునా కనిపించే అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యేలపై నాలుగు రాళ్లేయడంతో లోకేశ్‌ యాత్ర ముగిసింది. ఎవరో రాసిచ్చిన స్పీచ్‌ను కూడా సరిగా చదవలేక.. అందులోని వాస్తవాలను సరిచూసుకోకపోవడం మొదటికే మోసం తీసుకొచ్చింది. ఇంతేనా.. ప్రతీ నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడం గమనార్హం. 

టీడీపీ నేత నారా లోకేశ్‌ చేపట్టి పాదయాత్ర ఏప్రిల్‌ 13న అనంతపురం జిల్లా నుంచి నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గంలోకి చేరింది. 14 నియోజకవర్గాల్లో సాగిన యాత్ర మంగళవారం ఆళ్లగడ్డ నియోజకవర్గం దాటి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లికి చేరింది. 40 రోజుల పాటు సాగిన పాదయాత్రను టీడీపీ శ్రేణులు పెద్ద ప్రహసనంలా నిర్వహించారు. జనాల తరలింపునకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలీ చెల్లించేందుకు.. ఉదయం, సాయంత్రం వెయ్యి మంది కనిపించేలా చూసుకునేందుకు నేతలు పడిన కష్టం అంతాఇంతా కాదు.

కూలీ చెల్లించినా జనాల్లో ఆసక్తి లేక ఎమ్మిగనూరు సభ అట్టర్‌ఫ్లాప్‌ కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పట్టింది. పాదయాత్రలో కూడా దారిలో కలిసే కులాలు, సంఘాలు, గ్రామాల వ్యక్తులను సాధారణంగా వచ్చే వారిని కాకుండా ‘ప్రత్యేకంగా అరేంజ్‌’ చేసిన వారితో నడిపించారు. దీంతో యాత్ర సహజత్వాన్ని కోల్పోయి నేతలకు విసుగుతెప్పించింది. ముఖాముఖి కార్యక్రమాలు కూడా పూర్తిగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులతో నడిపించారు.

బహిరంగసభ అర్థాన్నే మార్చేసిన లోకేశ్‌
జనాలు రాకపోవడంతో బహిరంగసభ అర్థాన్నే లోకేశ్‌ మార్చేశారు. ఇప్పటి వరకు సభ అంటే ఒక గ్రౌండ్‌ తీసుకుని వేదిక ఏర్పాటు చేస్తే ప్రాంగణం జనంతో నిండిపోయేది. కానీ లోకేశ్‌ యాత్రలో నిర్వహించిన సభలు మొత్తం సగటున 60 అడుగుల వెడల్పు, 160 అడుగుల పొడవుతో చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందులో కొంతమందిని తరలించి దాన్నే బహిరంగసభలా నిర్వహించారు. ఎమ్మిగనూరులో 80‘‘170, కోడుమూరులో 60‘‘160, పాణ్యంలో 60‘‘120, శ్రీశైలంలో 60‘‘120 లెక్కన వేదికలు ఏర్పాటు చేశారు. ఇలా బహిరంగసభను నిర్వహించింది రాష్ట్ర చరిత్రలో లోకేశ్‌ ఒక్కరే కావడం గమనార్హం.

ఈవినింగ్‌ వాక్‌లా పాదయాత్ర
కర్నూలు జిల్లాలో ఉదయం, సాయంత్రం యాత్ర నిర్వహించారు. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర నడిచారు. జనాలు రాకపోవడంతో లోకేశ్‌, ఆయన బృందం, వందమంది కూడా కార్యకర్తలు లేకుండా యాత్రలు నడిచాయి. దీంతో ఆత్మకూరు నుంచి ఉదయం పూట యాత్రకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కేవలం సాయంత్రం 4గంటల తర్వాత ఒక పూట మాత్రమే యాత్ర నిర్వహిస్తున్నారు. దీంతో పాదయాత్ర కాస్త ‘ఈవినింగ్‌ వాక్‌’ను తలపిస్తోంది.

అవగాహన లేమితో అభాసుపాలు
పాదయాత్రలో లోకేశ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు అతన్ని అభాసుపాలు చేశాయి. స్వతహాగా అవగాహన లేకపోవడం, స్థానికంగా ఇన్‌చార్జ్‌లను కాకుండా తాను ప్రత్యే కంగా ఏర్పాటు చేసుకున్న టీం ఇచ్చిన నోట్స్‌ చదవడంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ అభివృద్ధిపై సత్యదూర వ్యాఖ్యలు చేశారు. కోడుమూరు సభలో గోరంట్ల బ్రిడ్జి నిర్మిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారని, టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామ ని లోకేశ్‌ అన్నారు. వాస్తవానికి బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.24కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులను ఓఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ చేస్తోంది.

శంకుస్థాపన కోసం ఆర్థికశాఖ మంత్రి బుగ్గనతో పాటు ఎమ్మెల్యేలు సుధాకర్‌, శ్రీదేవి, కుడా చైర్మన్‌కోట్ల హర్షవర్దన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. లోకేశ్‌ తప్పులు మాట్లాడినా వాస్తవాలు స్థానికంగా ఉన్న ప్రజలకు తెలుసుకాబట్టి నియోజకవర్గంలో అభాసుపాలయ్యాడు. చివరకు డోన్‌లో జరిగిన ఎస్సీల ముఖాముఖిలో విదేశీ విద్య గురించి మాట్లాడుతూ ‘దళితులు పీకింది, పొడిచింది ఏమీ లేదని, తాను దానిపై పోరాటం చేశాన’ని అన్నారు. దీనిపై జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడ్డారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు వాస్తవాలను వివరిస్తూ ధ్వజమెత్తారు. దీనికి కనీసం ఆధారాలు చూపించి గట్టి కౌంటర్‌ కూడా టీడీపీ నేతలు ఇవ్వలేకపోయారు.

విభేదాలు.. తన్నులాటలు
పాదయాత్ర మొదలైన రోజు నుంచి అడుగడుగునా వర్గ విభేదాలు లోకేశ్‌కు తలనొప్పిగా మారాయి.

డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, కేఈ ప్రభాకర్‌ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సుబ్బారెడ్డికి సహకరించే ప్రసక్తే లేదని కేఈ వర్గం తేల్చిచెప్పింది. కరపత్రాలు పంపిణీ చేసింది.

ఆలూరులో కోట్ల సుజాతమ్మ, వైకుంఠం మల్లికార్జున, వీరభద్రగౌడ్‌, శివప్రసాద్‌ ఎవరికి వారు వర్గాలుగా విడిపోయారు. దేవనకొండ క్రాస్‌లో కోట్ల, శివప్రసాద్‌ వర్గాల మధ్య గొడవ జరిగింది.

మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఉలిగయ్య, ముత్తురెడ్డి వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు.

ఎమ్మిగనూరులో ఐదు రోజులు యాత్ర సాగితే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన వర్గం పూర్తిగా గైర్హాజరయ్యారు.

కోడుమూరులో లోకేశ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలకడం మినహా యాత్ర జరిగిన రెండురోజులు లోకేశ్‌తో కలిసి ఇన్‌చార్జ్జ్‌ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి అడుగు కూడా నడవలేదు. కోడుమూరు బహిరంగసభలోనూ కన్పించలేదు.

నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ, ఆమె వర్గం భౌతికంగా దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో అఖిల రిమాండ్‌కు వెళ్లింది.

ఇదీ నిజం!
పశ్చిమప్రాంత రైతాంగానికి మేలు చేసే పులికనుమ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రాణప్రతిష్ట చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.263 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి హోదాలో 2008 సెప్టెంబర్‌ 21న పులికనుమ ప్రాజెక్టుకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు పులికనుమ ప్రాజెక్టు మిగులు పనులకు (ఎల్లెల్సీ నుంచి పులికనుమ వరకు అప్రోచ్‌ కెనాల్‌ తవ్వటం) రూ.24కోట్లు కేటాయించి ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇది తమ ఘనతగా లోకేశ్‌ చెప్పుకోవడం హాస్యాస్పదం.

గోనెగండ్ల మండలం వేముగోడు – తిప్పనూరు మధ్య తిప్పనూరు బ్రిడ్జిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.9కోట్లతో నిర్మిస్తే అది కూడా తమ ఘనతేనంటూ చెప్పుకోవడం పట్ల ప్రజలు నవ్వుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement