నమో.. శేషశైలావాసా!
ఆళ్లగడ్డ: అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగారు. వేకవజామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ రకాల స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.
శరభ వాహనం అధిరోహించిన
జ్వాలా నారసింహ స్వామి
అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలా నరసింహస్వా మి గురువారం శరభ వాహనం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అన ంతరం ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు.మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అల ంకరించి యాగశాలలో కొలువుంచి భక్తుల కు దర్శ న భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామిని శరభ వాహనంపై కొలువుంచి మాడవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఎగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, మధ్యా హ్నం అభిషేకం, రాత్రి పొన్నుచెట్టువాహనం సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో ఉదయం మోహిని అలంకారం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహనము సేవలు నిర్వహిస్తారు.


