రెచ్చిపోతున్న మట్టి మాఫియా!
టీడీపీ నాయకుల అరాచకాలు కనిపించడం లేదా?
బరితెగిస్తున్న టీడీపీ నేతలు మాయం అవుతున్న కొండలు చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్సు : పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో కొండలు, గుట్టలు రాత్రికి రాత్రే మాయమైపోతున్నాయి. అక్రమార్కుల ధాటికి వాటి ఆనవాళ్లు రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఇదంతా అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా వారు పట్టించుకోవడంలేదు. కల్లూరు మండలం బస్తిపాడు, ఓర్వకల్లు మండలంలోని కాల్వ, హుసేనాపురంలలో మట్టి మాఫియా రెచ్చి పోతుంది. ఆయా ప్రాంతాల్లో అక్రమంగా కొందరు టీడీపీ నాయకులు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొండలు, గుట్టలను లక్ష్యంగా చేసుకొని వాటిని రేయింబవళ్లు జేసీబీలతో తవ్వుతున్నారు. మైనింగ్ శాఖ దగ్గర అనుమతులు ఒక పేరుతో తెచ్చుకొని మరోపేరు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నేల చదును పేరుతో అనుమతులు పొందిన మాఫియా కొండలను తవ్వేస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో రాత్రికి రాత్రే కొండలు గుట్టలు మాయమైపోతున్నాయి. మరోవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు నేల చదును కోసం అనుమతులు కోరితే మైనింగ్ శాఖ తిరస్కరిస్తోంది. అదే టీడీపీ నాయకులకు అయితే అప్పటికప్పుడే అనుమతులు ఇచ్చి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా పట్టించుకోవడంలేదు. దీంతో మైనింగ్ శాఖల అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఒకచోట అనుమతులు తీసుకొని మరో చోటా కొందరు టీడీపీ నాయకులు మట్టిని తరలిస్తున్నారు. కాగా, మట్టి మాఫియా ధాటికి ఆయా గ్రామాల రోడ్లు దెబ్బతిని పోతున్నాయి. వాటిపై ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. బస్తిపాడులో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలను వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, పార్టీ నాయకులు కేవీ రమణారెడ్డి, మహేశ్వరెడ్డి, కార్పొరేటర్ నారాయణ రెడ్డి, బొల్లవరం గ్రామ నాయకులు పరిశీలించారు.
పాణ్యం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోయి ప్రకృతి సంపదను దోచేస్తోంది. టీడీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ కొండలు, గుట్టలను తవ్వేస్తున్నా ‘ఎల్లో’ మీడియా మాత్రం కిమ్మనకుండా ఉండడం దారుణం. వైఎస్సార్‌సీపీ నాయకులు చేయని పనులను వారిపై నెట్టి పబ్బం గడుపుకునే ‘ఎల్లో’ మీడియాకు టీడీపీ నాయకుల అరాచకాలు కనిపించడంలేదా? నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నా మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోకుండా వారికే సహకరించడం అన్యాయం. తక్షణమే అధికారులు స్పందించి విచారణ జరపాలి. లేదంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలకు దిగుతాం.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు
పోరాటం చేస్తామన్న వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
రెచ్చిపోతున్న మట్టి మాఫియా!


