దేదీప్యంగా తిరుపతమ్మ | - | Sakshi
Sakshi News home page

దేదీప్యంగా తిరుపతమ్మ

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జిల్లా బృందం వన్‌ హెల్త్‌ విధానం ఎంతో అవసరం కార్తికేయుని ఆలయం కళకళ

పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారు కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళవారం దీపాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాలు, పొంగళ్లతో బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ నూతక్కి వెంకట సాంబశివరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అలాగే స్థానిక శ్రీస్వయంభూ శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కళకళలాడాయి.

గన్నవరం: మండలంలోని బూతిమిల్లిపాడు గ్రామంలో ఉన్న తులిప్‌ గార్డెన్‌కు చెందిన చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూషన్‌(సీసీఐ)ను మంగళవారం డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ సందర్శించింది. తొలుత సీసీఐలోని పిల్లలకు పెద్దఆవుట పల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సింధుజ, డెంటిస్ట్‌ డాక్టర్‌ శ్రీజ నేతృత్వంలో వైద్య పరిక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన ఆరోగ్య సూచనలు చేశారు. అనంతరం కమిటీ సభ్యులు పిల్లలతో మాట్లాడి ఆహారం, వసతి, విద్య, వైద్యం వంటి సదుపాయలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 1098కు ఫోన్‌ చేయాలని సూచించారు. కమిటీ సభ్యులైన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్లు బి. కిషోర్‌, కె. మధుబాబు, ఆర్‌బీఎస్‌కె ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ హిమబిందు, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ రత్నకుమారి పాల్గొన్నారు.

కృష్ణలంక(విజయవాడతూర్పు): యాంటీమైక్రోబియల్‌ నిరోధకతను సమర్థంగా ఎదుర్కోడానికి మానవ, జంతు, పర్యావరణ ఆరోగ్యాన్ని సమన్వయం చేసే వన్‌ హెల్త్‌ విధానం అత్యంత అవసరమని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ.ఏడుకొండలరావు పేర్కొన్నారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్‌ నిరోధకత అవగాహన వారోత్సవం–2026 సంద ర్భంగా విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాంటీబయాటిక్స్‌ విచక్షణారహిత వినియోగం వల్ల కలిగే దుష్ఫరిణామాలు, చేతుల పరిశుభ్రత, యాంటీమైక్రోబియల్‌ స్టీవార్డ్‌షిప్‌ తదితర అంశాలపై విద్యార్థులు సమాచారాత్మక పోస్టర్లను రూపొందించి, తమ సృజనాత్మకతను చాటుకున్నారు. వారోత్సవాల్లో భాగంగా మైక్రోబయాలజీ విభాగ అధ్యాపకుల ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానం కార్తిక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తజనంతో కళకళలాడింది. తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రధాన క్యూలైన్లన్నీ భక్తులతో బారులు తీరాయి. నాగపుట్ట, నాగమల్లివృక్షం, పొంగళ్లశాల, దీపారాధన ప్రాంతం వద్ద రద్దీ ఏర్పడింది. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం ఆలయ ధ్వజస్తంభానికి జ్వాలా తొరణం ఏర్పాటు చేశారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ వివిధ సేవా టికెట్ల ద్వారా మంగళవారం రూ. 8,79,147 ఆదాయం సమకూరినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement