పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ

Nov 25 2026 9:30 AM | Updated on Nov 25 2026 9:30 AM

కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఈనెల 26న జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు, గుడివాడ, తాడిగడప మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌తో కలిసి ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ మెటీరియల్‌, స్టాట్యూటరీ కవర్లు, ఫారాలను గ్రామ పంచాయతీ, పోలింగ్‌ స్టేషన్‌ వారీగా మరోసారి తనిఖీ చేయాలన్నారు. బ్యాలెట్‌ పేపర్లు, అభ్యర్థుల గుర్తులు, సీరియల్‌ నంబర్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలింగ్‌ సిబ్బందికి యారో స్టిక్స్‌ సరిపడా అందజేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి ఇంకు వేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు సమన్వయంతో, అప్రమత్తంగా పనిచేసి పోలింగ్‌, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. ధన లక్ష్మి, ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు తదితర ఎన్నికల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు..

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాకు కలెక్టర్‌ డీకే బాలాజీ వివరించారు. మంగళవారం అమరావతి నుంచి ఎస్‌ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పోస్టల్‌ బ్యాలెట్ల భద్రత, పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ట్రైనీ కలెక్టర్‌ నమ్రత అగర్వాల్‌ , డీఆర్వో శ్రీధర్‌ రెడ్డి, డీపీవో ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement