పౌర్ణమి స్నానాలకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పౌర్ణమి స్నానాలకు పటిష్ట బందోబస్తు

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా వాహనాల కోసం పార్కింగ్‌ స్థలాలు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మచిలీపట్నం మండలం మంగినపూడి, కోడూరు మండలంలోని హంసలదీవి బీచ్‌లలో మంగళవారం జరిగే కార్తిక పౌర్ణమి పుణ్య స్నానాలను పురస్కరించుకుని కృష్ణా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 500 మంది పోలీసులకు బందోబస్తు బాధ్యతలు అప్పగించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో పాటు హోంగార్డులు, మహిళా కానిస్టేబుళ్లు బందరు, అవనిగడ్డ డీఎస్పీలు ఆవుల శ్రీనివాసరావు, అభిషేక్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. మంగినపూడిబీచ్‌లో జరిగే స్నానాలకు సంబంఽధించి బీచ్‌ వద్ద 200 మంది, చిలకలపూడి శ్రీపాండురంగస్వామి ఆలయం వద్ద బందోబస్తు నిమిత్తం 150 మందిని నియమించారు. హంసలదీవి బీచ్‌ వద్ద మరో 150 మంది పోలీసులను నియమించారు. మచిలీపట్నం పోలీసు కల్యాణ మండ పంలో ఎస్పీ ఆదేశాల మేరకు బందరు రూరల్‌ సీఐ ఏసుబాబు, అవనిగడ్డ సీఐ యువకుమార్‌ సిబ్బందితో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించి బందోబస్తు నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

నిరంతర పర్యవేక్షణ

మంగినపూడి, హంసలదీవి బీచ్‌ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉండటంతో వారి రక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సముద్ర తీరం వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. భక్తుల ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేసుకునేందుకు మంగినపూడి బీచ్‌ సమీపంలో మూడు పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. బీచ్‌ అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌ వెనుక ఖాళీ ప్రదేశంతో పాటు మేరీమాత చర్చి సమీపంలో మరో పార్కింగ్‌, గిరిపురం సమీపంలో ఇంకో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. హంసలదీవి బీచ్‌ సమీపంలోని డాల్ఫిన్‌కు కుడి, ఎడమ భాగాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలు, దేవాలయం వద్ద ఉన్న మరో ఖాళీ ప్రదేశాన్ని పార్కింగ్‌ కోసం కేటాయించారు.

నాలుగు ప్రత్యేక మొబైల్‌ టీంలు

స్నానాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు దొంగల చేతివాటాన్ని అరికట్టేందుకు, మహిళల రక్షణను దృష్టిలో పెట్టుకుని బందోబస్తులో భాగంగా నాలుగు మొబైల్‌ టీంలను ఏర్పాటుచేశారు. ఈ టీంలు సముద్రం ఒడ్డున నిరంతరం తిరుగుతూ నిఘా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. భక్తుల వస్తువులు అపహరణకు గురైనా, పిల్లలు తప్పిపోయినా తక్షణమే పోలీసుల సహాయం పొందేలా పబ్లిక్‌ అడ్రెస్సింగ్‌ సిస్టంను ఏర్పాటుచేశారు. నేరస్తుల కదలికలను పసిగట్టేందుకు మఫ్టీ సిబ్బంది ప్రత్యేకంగా నియమించారు. బీచ్‌, గుడి ప్రాంతాల్లో మఫ్టీ సిబ్బంది నిరంతరం తిరుగుతూ భక్తుల వస్తువులకు భద్రత కల్పించేలా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement