గుడివాడ పట్టణాభివృద్దికి కృషి చేస్తా టిడ్కో, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు పట్టణంలో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం
దీర్ఘకాలిక సమస్యలపై ఫోకస్..
వైఎస్సార్ సీపీ గుడివాడ మునిసిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి ప్రవీణ
గుడివాడరూరల్: గుడివాడ పట్టణాభి వృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గుడివాడ మునిసిపాలిటీ వైఎస్సార్ సీపీ చైర్ పర్సన్ అభ్యర్థి మెరుగుమాల ప్రవీణ అన్నారు. విద్యావంతురాలిగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికల్లో తాను గుడివాడ మునిసిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఇప్పటికే తన భర్త మెరుగుమాల కాళీ వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) సహకారంతో మునిసిపాలిటీలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చూపడమే కాకుండా, స్వచ్ఛమైన తాగునీరు, కాలుష్య నివారణే లక్ష్యంగా పని చేస్తానన్నారు. మంగళవారం ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
టిడ్కో, జగనన్న కాలనీలో సమస్యలకు పరిష్కారం
గతంలో గుడివాడ మండలం మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో 77ఎకరాల్లో సర్వాంగ సుందరంగా వైఎస్సార్ జగనన్న కాలనీ పేరుతో ఒకే చోట 8,912 ఇళ్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద టిడ్కో లే అవుట్‌ను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు అందజేశారు. దాని పక్కనే 178.63 ఎకరాల్లో జగనన్న కాలనీలో 7,728వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం టిడ్కో కాలనీలో పేద, బడుగు, బలహీన వర్గాలు నివాసముంటుండగా.. వారికి కనీస వసతులు కన్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. డ్రెయినేజీ, తాగునీరు, వాడుక నీరు తదితర మౌలిక వసతులు కల్పించలేదు. అంతేకాక టిడ్కో ప్లాట్ల రుణాలను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి.. ఆ ప్రాంత ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. తాను మునిసిపల్ చైర్‌పర్సన్‌గా విజయం సాధిస్తే టిడ్కో కాలనీల్లో ఉండే ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటా.
అండగా ఉంటా..
పట్టణంలో రెండున్నరేళ్లుగా విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు. తమ పార్టీ కోసం పని చేసిన వారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడమే లక్ష్యంగా కూటమి నాయకులు వ్యవహరించారు. చిన్న వ్యాపారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు హత్యలు, మహిళా ఉద్యోగులపై వేధింపులు చేసినా కనీస చర్యలు తీసుకోలేదు. వారందరికీ అండగా ఉంటా.. తగిన న్యాయ చేస్తా.
మెరుగుమాల ప్రవీణ(ఫైల్)
నాపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపిస్తే పట్టణంలోని 48వార్డుల సమగ్రాభివృద్దికి కృషి చేస్తా. ముఖ్యంగా పట్టణంలోని డ్రెయిన్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. చిన్నపాటి వర్షాలకే బస్టాండ్ రోడ్, ఏలూరురోడ్డు, బంటుమిల్లి రోడ్డు నీట మునిగి రహదారులపై నీరు ప్రవహిస్తున్నాయి. 48వార్డుల్లో ఉన్న శివారు ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన తాగునీరు అందించేలా పని చేస్తా. పట్టణంలో చెత్తను తరలించేందుకు అరకొరగా వాహనాలు ఉన్నాయి. ఫలితంగా పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. చెత్తను తరలించేందుకు పూర్తి సామర్థ్యం మేరకు వాహనాలు లేకపోవడంతో చెత్త కుప్పలతో వీధులు దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల చెత్త కుప్పలను తగలబెడుతుండటంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. అదే విధంగా పట్టణంలో రోజురోజుకీ పెరుగుతున్న కుక్కల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా.


