22న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహణ వివరాలు వెల్లడించిన కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గుడివాడ, తాడిగడప మునిసిపాలిటీల పరిధిలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న మునిసిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఈ నెల 22వ తేదీన వినియోగించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని సిబ్బందికి అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య మునిసిపల్ హై స్కూల్, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో నియమితులైన సిబ్బందికి మునిసిపాలిటీ ఎలక్షన్ సెల్‌లో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఎన్నికల విధులకు అధికారికంగా నియమితులైన సిబ్బంది మాత్రమే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలకు ఏమైనా సందేహాలు ఉంటే అసిస్టెంట్ ఏఎంవో ఆర్ శ్యాంసుందర్(95153 11229)ను సంప్రదించాలన్నారు.
మూడు విడతలుగా..
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక మేరకు ఆయా డివిజన్ల పరిధిలోని మండలాల్లో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులకు మూడు విడతలుగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి విడత గుడివాడ రెవెన్యూ డివిజన్‌లోని ఆరు మండలాల్లో జరుగుతున్న దృష్ట్యా అక్కడ ఓటు హక్కు ఉండి ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు పోస్టల్ బ్యాలెట్‌ను ఆయా ఫెసిలిటేషన్ కేంద్రాల్లో వినియోగించుకోవాల్సి ఉంది. రెండో విడత ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాలకు 27వ తేదీన, మూడో విడత బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాలకు 30వ తేదీన ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు ఫెసిలిటేషన్ కేంద్రానికి వచ్చేటప్పుడు ఎన్నికల విధులకు నియమించిన ఉత్తర్వులు, పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్దేశించిన ఫారం, గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు.


