పకడ్బందీగా ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ

Nov 18 2026 2:19 AM | Updated on Nov 18 2026 2:19 AM

పకడ్బందీగా ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ

ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): ఎంపీపీ, ఉపాధ్యక్షుడు, కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌ నుంచి మంగళవారం సాయంత్రం ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కో–ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు సంబంధించి మైనార్టీ వర్గాల అర్హులైన వ్యక్తులను మాత్రమే నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నామినేషన్లను నిర్ణీత ఫారం–3లో స్వీకరించాలని, ఎన్నికై న ఇద్దరు ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరు అభ్యర్థి ప్రతిపాదించగా మరొకరు బలపరచాలని, అభ్యర్థి తన అంగీకారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉదయం10 గంటల్లోపు నామినేషన్ల స్వీకరణ పూర్తి చేసి అనంతరం పరిశీలన చేపట్టి మధ్యాహ్నం 12 గంటల్లోపు చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను నోటీస్‌ బోర్డులో ప్రకటించాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం 1.00 గంట వరకు గడువు ఉంటుందని ఆ తరువాతే సమావేశం నిర్వహించాలన్నారు.

కోరం తప్పనిసరి..

సమావేశానికి మొత్తం సభ్యుల్లో 50 శాతం కోరం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి ఫారం–ఎ, ఫారం–బి సమర్పణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో సభ్యులందరూ ముందుగానే సమావేశ ప్రాంగణానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోరం లభించని పక్షంలో నిబంధనల ప్రకారం ఒక గంట వేచి ఉండి అప్పటికీ రాకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో ఎం. శ్రీహరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement