నిబంధనలకు పాతర.. తవ్వకాల జాతర! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు పాతర.. తవ్వకాల జాతర!

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

నిబంధనలకు పాతర.. తవ్వకాల జాతర!

నడకుదురు రేవులో యథేచ్ఛగా ఇసుక, బుసక దోపిడీ

తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు..

చల్లపల్లి: మండలంలో ఇసుక, బుసక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలు, అధికారుల పర్యవేక్షణ అన్నీ తమకు పట్టవన్నట్లుగా పట్టపగలే ఇసుక, బుసక దోపిడీకి తెరలేపింది. కృష్ణా జిల్లా, చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురు రేవులో పొక్లయిన్లను ఏర్పాటు చేసి సుమారు 10 నుంచి 15 ట్రాక్టర్లతో యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు.

నిషేధిత ప్రాంతంలో తవ్వకాలు..

నడకుదురు, నిమ్మగడ్డ, ఆముదార్లంక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు సీఆర్‌జెడ్‌(కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌) పరిధిలో ఉండటంతో ఇసుక, బుసక తవ్వకాలు, తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినప్పటికీ వాటిని లెక్కచేయకుండా పట్టపగలే పొక్లయిన్లతో ఇసుక, బుసకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించడం చర్చనీయాంశంగా మారింది. కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈ వ్యవహారంలో ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రాజకీయ నాయకుల అండదండలతో..

ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందడి ముగిసి రాజకీయ నాయకులు పదవుల వ్యవహారాల్లో నిమగ్నమైన వేళ ఇసుక, బుసక మాఫియా మాత్రం తరలింపు కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకుల అండదండలతోనే బుసక అక్రమ రవాణా సాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు పేర్కొంటున్నారు.

పర్యావరణానికి ముప్పు..

అక్రమ ఇసుక, బుసక తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా నదీ పరివాహక ప్రాంత పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సీఆర్‌జెడ్‌ నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఇంత బహిరంగంగా ఇసుక, బుసక తరలింపు జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్‌, పర్యావరణ శాఖల అధికారులు ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్న నడకుదురు వద్ద ఇసుక, బుసకను తవ్వుకునేందుకు ఎవ్వరికీ, ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. వెంటనే సిబ్బందిని పంపి విచారిస్తాం. సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్న రీచ్‌లలో ఎవరైనా తవ్వకాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– ఎం.హరనాథ్‌, తహసీల్దార్‌, చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement