కార్తిక మాసం తొలి ఆదివారం కావడంతో పెరిగిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు కిటకిట అంతరాలయ దర్శనం నిలిపివేత
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం, తొలి ఆదివారం, షష్ఠి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారితో పాటు మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. మరో వైపున ఆదిదంపతులకు నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణోత్సవం, లక్ష కుంకుమార్చనల్లో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. కార్తిక మాసం వన సమారాధనలు ప్రారంభం కావడంతో పలువురు భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో అల్పాహారం, ప్రసాదాలను స్వీకరించారు. మరో వైపున ఉదయం 10 గంటలకు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మహామండపం 6వ అంతస్తుకు, ఇటు ఘాట్‌రోడ్డులో లక్ష్మీ గణపతి ప్రాంగణం వరకు రద్దీ చేరుకోవడంతో ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయ ప్రాంగణంలోని అన్ని టికెట్ విక్రయ కేంద్రాలకు రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని ప్రొటోకాల్, వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. ఆన్‌లైన్‌లో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మధ్యాహ్నం రెండు గంటలకు అంతరాలయానికి అనుమతించారు. మరో వైపున మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం 11.40కి అన్ని దర్శనాలు నిలిపివేశారు. తిరిగి 12–15 గంటలకు దర్శనాలు ప్రారంభం కాగా అప్పటికే క్యూలైన్లలో మరింత రద్దీ పెరిగింది. దీంతో భక్తులకు త్వరతిగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ క్యూలైన్లను పర్యవేక్షించారు. క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు మంచినీటి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉపాలయాల్లోనూ పండుగ వాతావరణం
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని నటరాజ స్వామి వారి ఆలయం, అమ్మవారి సహస్ర కుంకుమార్చన, సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం, లక్ష్మీగణపతి ప్రాంగణాలలో భక్తుల తాకిడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఉపాలయాల్లో సపరివార దేవతలను దర్శించుకున్న అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అన్నదాన భవనానికి చేరుకుని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
కార్తిక ప్రత్యేక పూజలు
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలతో పాటు కార్తిక మాసం ప్రత్యేక పూజలైన సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ సేవల్లో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారు సేవ, పల్లకీ సేవల్లో ఉభయ దాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు.


