నాగాయలంక: రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించిన దివిసీమ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త, ఎలోరియా మాజీ డైరెక్టర్ కమ్మిలి రాంబాబుకు తెలంగాణ రాష్ట్రం మచ్చింతల్‌లోని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్తపతి మహోత్సవం సందర్భంగా సమతా పురస్కారం ప్రకటించింది. దేశ సేవలో తరించిన వివిధ రంగాలకు చెందిన 70 మందికి త్రిదండి చిన జీయర్ స్వామి గురువారం పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన కృష్ణా జిల్లా దివిసీమ అవనిగడ్డ మండలం బందలాయిచెరువు గ్రామానికి చెందిన కమ్మిలి రాంబాబును చిన జీయర్ స్వామి సత్కరించి రూ.70 వేల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ(టెక్) ఆప్టికల్ ఇంజినీరింగ్ పట్టా పొందిన రాంబాబు 1983లో డీఆర్డీఓలో చేరి హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ)లో అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్‌గా ఉద్యోగ విరమణ చేశారు. రాంబాబు సమతా పురస్కారం అందుకున్న సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తదితర దివిసీమ ప్రముఖులు, పౌరులు శుక్రవారం అభినందనలు తెలిపారు.


