కోనేరుసెంటర్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి పరిశీలన, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రచురణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. గురువారం కృష్ణా విశ్వవిద్యాలయంలో అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో మచిలీపట్నం డివిజన్ పరిధిలోని రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులకు (ఏఆర్వోలు) నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, నోటిఫికేషన్లో నామినేషన్లు స్వీకరించే ప్రదేశం, తేదీలు, సమయాలు తదితర వివరాలను స్పష్టంగా పొందుపరచాలన్నారు.
తప్పని సరిగా నమోదు చేయాలి
ప్రతి నామినేషన్‌కు క్రమ సంఖ్య కేటాయించడంతో పాటు స్వీకరించిన తేదీ, సమయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నా నామినేషన్ల స్వీకరణ ఆధారంగా చేసుకుని జాబితాను రూపొందించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నామినేషన్లో లోపాలు ఉంటే చెక్‌లిస్టులో స్పష్టంగా పేర్కొని అభ్యర్థికి తెలియజేయాలని సూచించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా తయారీలో తెలుగు అక్షర క్రమాన్ని, ఎన్నికల నిబంధనల్లో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని కచ్చితంగా పాటించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి వసతులు కల్పించాలన్నారు. ముందస్తున ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో బందరు ఆర్డీవో సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీపీఓ ఎం. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


